ముగిసిన వర్షకాలం.. 7 అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు

ముగిసిన వర్షకాలం..  7 అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు

హైదరాబాద్: క్యాలెండర్ ఇయర్ ప్రకారం నిన్నటితో వర్షాకాలం ముగిసినట్టే. ఇక నుంచి వర్షాలు కురవడం తగ్గిపోవడమే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న వర్షాకాలం సీజన్ ముగిసే నాటికి కురవాల్సిన వర్షం కన్నా 46 శాతం అధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సీజన్ ఉన్న 4 నెలల్లో జూలైలో అత్యధిక వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే.. ఈసారి 7 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. సీజన్ ముగిసే నాటికి 4 జిల్లాల్లో మినహా, అన్ని జిల్లాల్లో అధిక, అత్యధిక వర్షపాతం నమోదైంది.

సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది జూన్ 2న కేరళకు వస్తాయని అధికారులు అంచనా వేయగా.. మూడ్రోజుల ముందుగానే కేరళను తాకాయి. అనుకున్న సమయానికి ముందుగా కేరళకు వచ్చినా.. రాష్ట్రాన్ని మాత్రం ఆలస్యంగానే తాకాయి. ఈసారి వానాకాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయన్న అధికారుల అంచనాలు నిజమయ్యాయి. ఈ సీజన్ లో కురవాల్సిన వర్షం కన్న 46 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 

జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకే.. 

క్యాలెండర్ ఇయర్ ప్రకారం వర్షాకాలం సీజన్ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఈ ఏడాది జూన్ లో 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జులైలో అధికారుల అంచనాలు క్రాస్ అయ్యి 145 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో మైనస్ 20 శాతం లోటు వర్షాలు కురవగా.. సెప్టెంబర్ లో 35 శాతం అధిక వర్షాలు పడ్డాయి. మొత్తానికి ఈ సీజన్ లో కురవాల్సిన వర్షాల కన్నా 46 శాతం అధిక వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 7 శాతం ఎక్కువేనని వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.

ప్రభావం చూపిన ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు 

ఈ వర్షాకాలం సీజన్ మొత్తంలో 7 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాల ప్రభావం రాష్ట్రంపైన స్ట్రాంగ్ గా పడటం కారణంగానే ఈ ఏడాది అధికారుల అంచనాలు నిజమయ్యాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదు కాగా.. 19 జిల్లాల్లో అధిక వర్షాలు పడ్డాయి. 4 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో 91 శాతం అత్యధిక వర్షాలు పడగా.. కుమ్రంభీమ్ జిల్లాలో 84 శాతం, ములుగు 80. నిర్మల్ 81, మంచిర్యాల 70 శాతం అధికవర్షాలు పడ్డాయని అధికారులు తెలిపారు. 

అక్టోబర్ 1 నుంచి వర్షాలు కురవడం తగ్గిందని, అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలూ పెరుగుతాయని అంచనా వేసినట్లు వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ మాన్ సూన్ సీజన్ లో రుతుపవనాలు యాక్టివ్ గా ఉంటూ అధిక వర్షాలు కురిశాయి. సూర్యాపేటలో అతితక్కువగా 8 శాతం వర్షపాతం నమోదయ్యిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి లోటు వర్షపాతం లేకుండా ఈ ఏడాది ముగిసింది.