ముంచుకొస్తున్న ముప్పు..తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు

ముంచుకొస్తున్న ముప్పు..తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు
  • మోంథా తుపాన్ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక 
  • రేపు 4 జిల్లాలకు రెడ్, 6 జిల్లాలకు ఆరెం జ్ అలర్ట్
  • భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో కుండపోత వానలు కురిసే చాన్స్ 


హైదరాబాద్, వెలుగు:  మోంథా తుఫాన్​ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగానే ఉండనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం ఉదయం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అది సోమవారం తుపానుగా, మంగళవారం తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పింది. ఆ రోజుకు గాను నాలుగు జిల్లాలకు రెడ్, ఆరు జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్ జారీ చేసింది. జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​జిల్లాలకు రెడ్​అలర్ట్ ఇవ్వగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్​జారీ చేసింది. 

మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ఇచ్చింది. ఇక బుధవారానికి గాను ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గురువారానికి గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్​సిటీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని.. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి.