కదిలిన మెట్రో..! కిషన్ రెడ్డి చొరవ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ తో సీఎం రేవంత్ చర్చలు

కదిలిన మెట్రో..! కిషన్ రెడ్డి చొరవ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ తో సీఎం రేవంత్ చర్చలు
  • మెట్రో ఫేజ్-1 ఐఆర్ఎఫ్‌‌సీ లోన్‌‌కు లైన్​క్లియర్!
  • ఫేజ్-2లో కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ సానుకూలత?
  • నేడు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఖట్టర్‌‌‌‌తో భేటీ.. అనంతరం అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి,  సీఎం రేవంత్‌‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్ల నడుమ ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ –2 అనుమతులు, ఫేజ్–1 లోన్​ క్లియరెన్స్ సమస్య కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. సీఎం రేవంత్‌‌రెడ్డి లేఖపై స్పందించిన కిషన్‌‌రెడ్డి చొరవ తీసుకోవడంతో ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. సోమవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి  జరిపిన చర్చలు సానుకూల దిశలో  సాగినట్టు తెలిసింది. 

రాష్ట్ర అభివృద్ధి, మెట్రో విస్తరణ అంశాలే ఎజెండాగా సుదీర్ఘంగా ఈ  భేటీ జరిగినట్టు సమావేశం అనంతరం సీఎం రేవంత్‌‌రెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా మెట్రో ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌‌సీ) నుంచి నిధుల సమీకరణపై కేంద్ర మంత్రి  అశ్వినీ వైష్ణవ్‌‌తో సీఎం చర్చించారు. ఈ లోన్​ విషయంలో ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా కేంద్ర మంత్రి ముందుంచారు. మెట్రో నిర్వహణతోపాటు నిధుల్ని తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను వివరించినట్టు తెలిసింది. 

ఇందులో భాగంగా  మెట్రో–1కు ఐఆర్ఎఫ్​సీ లోన్ ​క్లియరెన్స్‌‌తోపాటు ఫేజ్–2 కు సంబంధించి కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు  సమాచారం. కాగా, నేడు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌‌‌‌లాల్‌‌ ఖట్టర్‌‌‌‌తో భేటీ అనంతరం అధికారిక ప్రకటన ఉంటుందని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది.

కిషన్‌‌రెడ్డి చొరవ..

మెట్రో విషయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​తో చర్చలకు కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి చొరవచూపి.. మధ్యవర్తిత్వం చేశారు . హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి అడ్డుకుంటున్నారని, ఐఆర్ఎఫ్‌‌సీ ఖాతా లో జమైన రూ.13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా ఆపివేయించారని గత వారం సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులిస్తూ... ప్రాజెక్టులను అపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీకి తాను కూడా వస్తానని కిషన్‌‌రెడ్డి ప్రతిస్పందించారు. 

ఈ క్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డికి ఇటీవల సీఎం రేవంత్‌‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో ఢిల్లీలో ఉంటానని,  రైల్వే మంత్రితో అపాయింట్‌‌మెంట్​ ఖరారు చేయిస్తే, ఇద్దరం కలిసి వెళ్లి తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ అంశాలపై చర్చిద్దామని లేఖలో స్పష్టం చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ ఈ నెల 18నే అన్ని వివరాలతో కూడిన లేఖను పంపినట్టు సీఎం గుర్తుచేశారు. 

ఈ భేటీ కోసం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఒప్పంద పత్రాలు, అనుబంధ డాక్యుమెంట్ల, వాస్తవ రికార్డులను తనతోపాటు ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఈ  లేఖకు స్పందిస్తూ...  కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో అపాయిట్‌‌మెంట్‌‌ ఫిక్స్ చేసినట్టు  కిషన్ రెడ్డి సోమవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6:30 గంటలకు సీఎం రేవంత్‌‌రెడ్డి రైల్వే భవన్ చేరుకోగా.. కాసేపటికే కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి అక్కడి వచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో ఇద్దరు భేటీ అయ్యారు.

తెలంగాణ ప్రయోజనాలను వివరించిన సీఎం..

దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన భేటీలో మెట్రో ఫేజ్–2కు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌‌రెడ్డి వివరించారు. విశ్వసనీయ సమాచారం  ప్రకారం.. తెలంగాణ అభివృద్ధిలో మెట్రో విస్తరణ ఆవశ్యకత, అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దిశలో ప్రభుత్వంపై పడే ఆర్థిక ఒత్తిడిని తట్టుకొని.. ప్రజల రవాణా సౌకర్యాలతోపాటు కల్పించాల్సిన మౌలిక వసతులను తెలియజేశారు. ఇందుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు, ప్రయాణికుల అవసరాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతోపాటు ఇతర అంశాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌‌రెడ్డి ముందు ఉంచారు. 

హైదరాబాద్ మెట్రో రైలు మొదటిదశ స్వాధీనం కోసం రావాల్సిన ఐఆర్ఎఫ్​సీ రుణంపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో మొదటి దశ స్వాధీనం కోసం ఎల్ అండ్ టీ, తమ ప్రభుత్వ ఒప్పందంతోపాటు భవిష్యత్తులో మెట్రో విస్తరణపై తమ ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. మెట్రో రుణం సొమ్మును బదలాయించాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్).. ఐఆర్ఎఫ్‌‌సీకి 2 సార్లు ఇన్వాయిస్ నోటీసులు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 12న మొదట ఇన్వాయిస్ పంపగా 15వ తేదీతో గడువు ముగియడంతో.. 16న మరోసారి ఇన్వాయిస్ పంపిందని పేర్కొన్నారు. జపాన్ సంస్థ నుంచి ఐఆర్ఎఫ్‌‌సీకి బదిలీ అయినప్పటికీ తమకు రుణం ఇవ్వడంపై ఇంకా స్పందించట్లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌‌ ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు.. భవిష్యత్ ప్రయాణ అవసరాలను తీర్చుతుందని వివరించారు. అభివృద్ధి, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకునే విషయంలో ముందడుగు వేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ కు ఆర్థిక సహకారం, నిధుల సమీకరణ, అనుమతుల విషయంలో సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తిచేశారు.  

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొన్న అశ్వినీ వైష్ణవ్.. సీఎం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. నిధుల సమీకరణ తమ పరిధిలోనిధే అయినా... మెట్రో విస్తరణకు కావాల్సిన అనుమతులు, ఇతర విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌‌‌‌తో చర్చించాలని సూచించినట్టు తెలిసింది.


సానుకూలంగా చర్చలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణ, దానికి సంబంధించిన నిధుల సమీకరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చర్చించినట్టు ఆయన చెప్పారు. దాదాపు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపామన్నారు. భేటీ అనంతరం రైల్వే భవన్ ముందు తన కాన్వాయ్ ఆపిన సీఎం మీడియాతో కాసేపు ముచ్చటించారు.

‘కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చర్చలు సానుకూలంగా సాగాయి. మంగళవారం  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌‌‌‌తో భేటీ ఉంది. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి కూడా పాల్గొంటారు. ఖట్టర్‌‌‌‌తో జరిగే భేటీలో మెట్రో రెండో దశ విస్తరణ, నిధుల సమీకరణ అంశాలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. 

కాగా,  మెట్రో రుణం, రెండో దశ మెట్రోలో భాగస్వామ్యానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో సీఎం రేవంత్ చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో నేడు ఖట్టర్‌‌‌‌తో భేటీలో క్లారిటీ రానుంది.  కాగా.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో జరిగిన భేటీపై కిషన్‌‌రెడ్డి స్పందించలేదు.