తెలంగాణలో మెట్రో కొత్త స్టోర్లు

తెలంగాణలో మెట్రో కొత్త స్టోర్లు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన హోల్‌సేల్‌ రిటైలర్‌‌ మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఈ ఏడాది మరో ఐదు స్టోర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని విస్తరించేందుకు, లోకల్‌ కిరాణా స్టోర్లతో ఉన్న భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్లాన్స్‌ వేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీలలో 2,000 కి పైగా కిరాణా స్టోర్లతో కలిసి పనిచేస్తోంది.  ఇండియాలో  మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ గత రెండేళ్లలోనూ  లాభాలను నమోదు చేసింది. కంపెనీకి ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా ఉందని మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా మేనేజింగ్‌ డైరక్టర్‌‌, సీఈఓ అరవింద్‌ మెడిరట్ట అన్నారు. ఇక్కడ ఫిజికల్‌ స్టోర్స్‌, ఈ–కామర్స్‌ వ్యాపారాలు వృద్ధి చెందడానికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు.  ఈ ఏడాది కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొత్తగా ఐదు స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని అన్నారు.  ప్రస్తుతం ఇండియాలోని 17 సిటీలలో కంపెనీకి 27 స్టోర్లున్నాయి. ఈ కొత్త స్టోర్ల కోసం కంపెనీ ఎంత మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయనుందో అరవింద్‌ వెల్లడించలేదు. ఫిజికల్ స్టోర్లను విస్తరించడంతో పాటు, కంపెనీ ‘స్మార్ట్‌ కిరాణా ప్రోగ్రామ్‌’లో భాగంగా లోకల్‌ కిరాణా స్టోర్లతో కలిసి పనిచేయనుందని అరవింద్‌ అన్నారు. కిరాణా షాపుల అమ్మకాలు పెరగడంలో మేము సాయం చేయగలమని నమ్ముతున్నామని అరవింద్‌ అన్నారు.