నాలుగు అంతస్తుల్లో ఎయిర్పోర్ట్​ మెట్రో స్టేషన్​ : మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి 

నాలుగు అంతస్తుల్లో ఎయిర్పోర్ట్​ మెట్రో స్టేషన్​ : మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి 

శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణ పనులపై హైదరాబాద్  ఎయిర్  పోర్టు మెట్రో లిమిటెడ్  ఫోకస్ పెట్టింది.   ప్రభుత్వమే సొంతంగా నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్ట్ రెండో దశపై అధికారులు స్పీడ్ పెంచారు. ఎయిర్  పోర్ట్  మెట్రో మార్గంపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజినీర్లు, సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ పై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. పనుల వేగాన్ని అధికారులు పెంచారు. 

రూ.6,250 కోట్లతో  రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు..

హైద్రాబాద్ లో మెట్రో రెండో దశ పనులపై వేగం ప్రభుత్వం పెంచింది. శంషాబాద్ ఇంటర్నేషనల్​ ఎయిర్ పోర్ట్ కు సిటీ నుంచి మెట్రో కనెక్టివిటీ కోసం చేపట్టిన రెండో దశ మెట్రోకు సర్కారు  ప్రాధాన్యత పెంచింది. రూ.6,250 కోట్లతో  రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు మెట్రో  4వ కారిడార్ ను నిర్మిస్తున్నారు. ఈనెల 9న సీఎం కేసీఆర్​ ఎయిర్ పోర్ట్ మెట్రోకు శంకు స్థాపన చేశారు. పది రోజుల్లోనే కొత్త రూట్ పై మెట్రో అధికారులు సర్వే మొదలు పెట్టారు. ఈ రూట్ లో భూ సేకరణ ప్రాబ్లమ్ లేకపోవడం, ఎక్కువగా ప్రభుత్వ స్థలాలే ఉండటంతో ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచారు.

కాలినడకన ఎండీ, ఇంజినీర్లు, సర్వే బృందాలు..

రాయదుర్గం మెట్రో స్టేషన్  నుంచి నార్సింగ్  జంక్షన్  వరకు మెట్రో మార్గాన్ని ఎన్వీఎస్ రెడ్డి, ఇంజనీర్ల బృందం పరిశీలించింది. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుందన్నారు. దాదాపు 10కిలోమీటర్లు కాలినడకన ఎండీ, ఇంజినీర్లు, సర్వే బృందాలు పరిశీలించాయి. స్టేషన్  స్థానాలు ప్రధాన రహదారి జంక్షన్  లకు దగ్గరగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

అందరికీ  ఉపయోగపడేలా డిజైన్

ఎయిర్ పోర్టు మెట్రో విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే కాకుండా, అందరికీ  ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నమని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. తక్కువ ఆదాయ వర్గాల వారు కూడా నగర శివారుల్లో మెరుగైన వసతి గృహాల్లో ఉండొచ్చని తెలిపారు. స్టేషన్ లకు సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో విశాలమైన పార్కింగ్  సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఐకియా ముందు ఎయిర్  పోర్టు మెట్రో స్టేషన్ , బ్లూ లైన్  కొత్త టెర్మినల్  నిర్మాణం జరపనున్నట్టు తెలిపారు. మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ కొత్త స్టేషన్,... పొడిగించిన కొత్త బ్లూ లైన్ స్టేషన్... పై రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలన్నారు. జేబీఎస్ స్టేషన్, అమీర్ పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండాలని సూచించారు.

పనిచేసే ప్రాంతాలకు 20 నిమిషాల్లోనే చేరుకునేలా..

ఎయిర్ పోర్ట్ మెట్రో రూట్ లో రెండు కొత్త స్టేషన్లు ఒకదానిపై ఒకటి నిర్మిస్తామని, బయోడైవర్సిటీ జంక్షన్  ఫ్లైఓవర్  మీదుగా ఎయిర్ పోర్టు మెట్రో వయాడక్ట్  క్రాసింగ్ ను జాగ్రత్తగా ప్లాన్  చేయాలన్నారు. భవిష్యత్ లో బీహెచ్ ఈఎల్ -లక్డీకాపూల్  మెట్రో కారిడార్  స్టేషన్  ను కలిపేలా నిర్మాణం ఉండాలని.. విమానాశ్రయం మెట్రో బయోడైవర్సిటీ జంక్షన్  స్టేషన్ ను ఒక ప్రత్యేక మార్గంలో ప్లాన్  చేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు 20 నిమిషాల్లోనే చేరుకునేలా ఈ కారిడార్ ను డిజైన్ చేయాలని సూచించారు. ఈ ప్రాంతం ఇప్పటికే భారీ భవనాలతో నిండి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి ఊహించలేనంతగా పెరిగే అవకాశం ఉండటంతో.. మెట్రో స్టేషన్లు, స్కై వాక్ ల నిర్మాణం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.  

DPR గోప్యంగా ఉంచి.. 

ఎయిర్ పోర్ట్ మెట్రో డీపీఆర్ ను బయటకు చూపించబోమని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో  మొదటి దశ మెట్రో నిర్మాణ సమయంలో భూసేకరణ, ప్రాజెక్ట్ నిర్మాణంపై వందల సంఖ్యలో కోర్ట్ కేసులు రావడంతో... ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. అందుకే ఎయిర్ పోర్ట్ మెట్రోలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు DPR గోప్యంగా ఉంచి సర్వే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తక్కువ స్టేషన్లు.. ఎక్కువ స్పీడ్

ఎయిర్ పోర్ట్ మెట్రో తక్కువ స్టేషన్లు.. ఎక్కువ స్పీడ్ తో వెళ్ళే  ప్లాన్ తో ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 31 కిలో మీటర్ల మేర ఎయిర్ పోర్టు మెట్రోలో 27.5km  ఎలివేటెడ్ కారిడార్ లో 1 కిలోమీటర్ రోడ్ లెవల్ లో వెళ్తుందన్నారు. 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లో మెట్రో ఉంటుందని.. ఎయిర్ పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ప్లాన్ చేస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే మెట్రో 120 కిలోమీటర్ల మ్యాగ్జిమమ్ స్పీడ్ ఉంటుందని.. 26 నిమిషాల్లో రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ కు చేరుకోవచ్చని తెలిపారు. ఇక లగేజ్ చెకింగ్ కూడా రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసేలా GMR అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు . డీపీఆర్ బయట పెట్టకపోవడంతో.. రియల్ బూమ్ పెంచేందుకే తమకు నచ్చిన విధంగా మెట్రో అలైన్మెంట్ తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.