
జైపూర్: జైపూర్‌కు చెందిన 71 ఏండ్ల తారాచంద్ అగర్వాల్ సంచలనం సృష్టించారు. ఇటీవల బ్యాంక్ మేనేజర్ గా రిటైరయిన ఆయన..పదవీ విరమణ తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీఏ చదువుతున్న మనవరాలికి సహాయం చేస్తున్నప్పుడు తనకు కూడా ఆ కోర్స్ చేయాలని ఆసక్తి కలిగిందని తారాచంద్ వెల్లడించారు. పట్టుదలతో చదివి సీఏ క్లియర్ చేసినట్లు చెప్పారు. శారీరక, మానసిక, సామాజిక అడ్డంకులను అధిగమించి తారాచంద్ దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
తారాచంద్ అగర్వాల్ ..2014 లో రాజస్థాన్‌లోని ఒక బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత తన భార్యతో కలిసి రోజూ మత గ్రంథాలను చదవేవారు. 2020లో తన భార్య మరణించిన తర్వాత తన ఒంటరితనాన్ని అధిగమించడానికి సీఏలో చేరి ఈ నెలలో జరిగిన ఫైనల్ పరీక్షలో పాస్ అయ్యారు.