
మెట్రో టికెటింగ్ ఉద్యోగుల సమ్మెకు ఎండ్ కార్డు పడింది. జీతాలు పెంచాలని రెండు రోజులుగా ఆందోళన చేసినా యాజమాన్యం కనికరించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీతాలు పెంచమని ఖరాకండిగా తేల్చిచెప్పింది. అంతేకాదు సిబ్బంది విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాలను తొలగిస్తామని హెచ్చరించింది. కాకపోతే నెల రోజుల తర్వాత సిబ్బందికి ట్రైన్ యాక్సిస్ ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇక చేసేది ఏమీ లేక మెట్రో టికెటింగ్ ఉద్యోగులు సమ్మెను విరమించారు.
జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది చేపట్టిన రెండు రోజులుగా ధర్నా చేశారు. నాగోల్ మెట్రో ఆఫీస్ దగ్గర టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. మెట్రోలో తమకు ఉచిత ట్రావెలింగ్, వసతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తమ జీతం రూ. 11 వేల నుంచి రూ. 20 వేలకు పెంచాలని కోరారు.
తమ వేతనాలు పెంచాలని మంగళవారం దాదాపు 300 మంది మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లో నిరసన చేపట్టారు. మెట్రోస్టేషన్స్ లో టికెటింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలోనూ తమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరో రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదన్నారు.