హైద రాబాద్ సిటీలో వాటర్ బోర్డు లో రీజినల్ అటానమీ... మూడు రీజియన్లకు స్వయం ప్రతిపత్తి!

హైద రాబాద్ సిటీలో  వాటర్ బోర్డు లో రీజినల్ అటానమీ... మూడు రీజియన్లకు స్వయం ప్రతిపత్తి!
  •     త్వరలోనే అధికారాల బదలాయింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ వెలుపలి వరకు విస్తరించిన మెట్రో వాటర్ బోర్డు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సెంట్రల్, సైబరాబాద్, మల్కాజిగిరి రీజియన్లకు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు ఆర్థిక, పరిపాలనా అధికారాలను బదలాయించేందుకు సిద్ధమవుతోంది. బోర్డు విస్తీర్ణం 1,450 చ.కి.మీ నుంచి 2053 చ.కి.మీ వరకు పెరగడం, ఓఆర్ఆర్ వెలుపల కొత్త ప్రాంతాలు విలీనం కావడంతో క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించేలా ఈ వికేంద్రీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ కొత్త విధానం అమలులోకి వస్తే.. ఇకపై డొమెస్టిక్ నల్లా కనెక్షన్లు, 20 ఫ్లాట్లు ఉండే అపార్ట్‌‌‌‌మెంట్ల అనుమతుల కోసం ప్రధాన కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రీజినల్ కార్యాలయాల్లోనే మంజూరు చేస్తారు. 

అధికారాల బదలాయింపులో భాగంగా ఈడీ స్థాయి అధికారులకు నెలకు రూ. 50 లక్షల వరకు పనులు చేపట్టే వెసులుబాటు కల్పించనున్నారు. అలాగే రూ. 80 వేల వరకు పనులను టెండర్లు లేకుండా కట్టబెట్టే అధికారం, లక్ష రూపాయలకు మించిన పనులకు నేరుగా టెండర్లు పిలిచే అధికారాన్ని రీజియన్లకే అప్పగించబోతున్నారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో వేగం పెంచేలా రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా, త్వరలోనే సత్వర సేవలు అందుబాటులోకి రానున్నాయి.