నేలపై పడుకోబెట్టి రోగికి చికిత్స .. ఎంజీఎంలో సిబ్బంది నిర్వాకం

నేలపై పడుకోబెట్టి రోగికి చికిత్స .. ఎంజీఎంలో సిబ్బంది నిర్వాకం

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో ఓ రోగిని నేలపై పడుకోబెట్టి చికిత్స చేశారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. గీసుగొండకు చెందిన సారయ్య అనారోగ్యంతో ఎంజీఎంకు వెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు అతడిని కింద పడుకోబెట్టి సెలైన్​ బాటిల్​ ఎక్కించారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్​ స్పందించారు. రోగిని నేలపైనే ఉంచి ట్రీట్ మెంట్ చేయడం సరైంది కాదని ఆయన తెలిపారు.

కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు. రెండు రోజులుగా తాను సెలవుపై ఉన్నానని ఆయన వెల్లడించారు. కాగా, ఉదయం సాధారణ ఓపీలు ముగియగానే  మధ్యాహ్నం సమయంలో రోగుల తాకిడి అత్యవసర విభాగానికి ఎక్కువగా ఉంటుంది.  వార్డుల్లో బెడ్లు​ఖాళీగానే ఉన్నా అత్యవసర విభాగంలో బెడ్ల కొరత తీవ్రంగా  ఉంది. అత్యవసర విభాగాన్ని విస్తరించాలని ఎన్నో ఏళ్లుగా రోగులు కోరుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు.