- ‘ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ’ స్థానంలో కేంద్రం కొత్త చట్టం
- ‘వీబీ జీ రామ్ జీ –2025’ పేరుతో త్వరలో లోక్‌సభలో బిల్లు
- సభ్యులకు ముసాయిదా ప్రతులు
- బిల్లు ఆమోదానికి విప్ జారీ
- పనులు చేసిన వారంలోనే కూలీ..
- గాంధీ పేరు తొలగించడంపై ప్రతిపక్షాల ఫైర్
న్యూఢిల్లీ: 20 ఏండ్లుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు ఇక కనుమరుగు కానున్నది. ఈ స్కీమ్ స్థానంలో కొత్తగా ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’ రానున్నది. కేంద్ర ప్రభుత్వం ‘వీబీ జీ రామ్ జీ బిల్లు-2025’ ను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
సోమవారం ఈ బిల్లును లోక్‌సభ సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్‌లో చేర్చిన కేంద్రం.. ఇందుకు సంబంధించిన ప్రతులను సభ్యులకు అందజేసింది. ఈ బిల్లు ఆమోదానికి బీజేపీ సభ్యులకు విప్ కూడా జారీచేసింది. ఈ బిల్లు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి తగ్గట్టుగా రూపొందించిన కొత్త ఉపాధి ప్రేమ్‌వర్క్ అని కేంద్రం తెలిపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ఏడాదిలో 125 రోజులపాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీని ఇవ్వడంతో పాటు సంపన్న, సుస్థిర గ్రామీణ భారత్‌ను సాధించడంలాంటి లక్ష్యాలను కొత్త చట్టంలో ప్రతిపాదించింది.
కాగా, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఈ బిల్లు ఉద్దేశం తెలుపుతూ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. గత 20 ఏండ్లుగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల కోట్లాది మంది పల్లె ప్రజలు ఉపాధి పొందారని తెలిపారు. అయితే, సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను మరింత విస్తరణ, ప్రభుత్వ పథకాలను మరింత సంతృప్తస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకే ఈ స్కీమ్స్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్టు వివరించారు. 2005లో యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను ప్రవేశపెట్టింది. 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)గా దాని పేరు మార్చారు. కాగా, ఇప్పుడు దీన్ని పూర్తిగా రద్దు చేసి, కొత్తగా ‘వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) 2025’ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.
గాంధీ పేరు తొలగింపుపై ప్రతిపక్షాల ఫైర్
ఉపాధి హామీ పథకం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలకా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చినప్పుడే ప్రధాని మోదీ దీన్ని గుంతలు తవ్వే పథకం అని అన్నారని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను అంతం చేయడమే వారి ఉద్దేశమని మండిపడ్డారు. మహాత్ముడి పేరు పథకానికి ఉంటే వారికి వచ్చిన సమస్య ఏంటో అర్థంకావడం లేదని విమర్శించారు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన పథకం కాబట్టి.. దీన్ని ఎత్తేయాలని చూస్తున్నారని అన్నారు. ఇది జాతిపిత మహాత్మా గాంధీకి అవమానమని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. కేటాయింపులు తగ్గించడం ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను కేంద్రం శిక్షించే అవకాశం ఉన్నదని తెలిపారు.
అసలు కేంద్రం ఉద్దేశం ఏంటి?: ప్రియాంకా గాంధీ
ఉపాధి హామీ పథకంనుంచి గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారని, పేరు తొలగించడం వెనుక అసలు కేంద్రం ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. ‘‘మహాత్మా గాంధీ మన దేశంలోనే కాకుండా.. ప్రపంచమంతా ఆయనను గొప్ప నాయకుడిగా పరిగణిస్తుంది. అయినప్పటికీ ఆయన పేరును తొలగించడం వెనుక ఉద్దేశం ఏమిటో నాకు నిజంగా అర్థం కావడం లేదు? ఇంతకీ మీ (మోదీ సర్కార్) ఉద్దేశం ఏమిటి?”అని అడిగారు. పార్లమెంట్ వెలుపల విలేకరుల సమావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.
‘‘ఏదైనా పథకం పేరు మార్చినప్పుడల్లా, కార్యాలయాల్లో, స్టేషనరీలో చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. దీని కోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇంత చేసినప్పటికీ దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరును ఎందుకు
తొలగిస్తున్నారు? ” అని కేంద్రాన్ని నిలదీశారు.
బిల్లులోని ముఖ్యాంశాలు..
- ప్రస్తుత పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెంపు
- ఇక నుంచి గ్రామ పంచాయతీల ద్వారా పనులకు ప్రణాళికలు
- వ్యవసాయ సీజన్లలో పీక్ టైంలో కూలీల కొరత రాకుండా ఉపాధి పనులు 60 రోజుల వరకు తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటు
- వికసిత భారత్ లక్ష్యాలకు తగ్గట్టుగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో పనుల ప్రణాళికలు
- పనులు ముగిసిన వారానికే కూలి చెల్లింపు తప్పనిసరి
- ప్రభుత్వం పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి చెల్లించడం కంపల్సరీ
- కేంద్రం నిర్ధారించిన పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ నిధులు కేటాయింపు
- కేటాయింపునకు అదనంగా నిధులు ఖర్చు చేస్తే వాటిని భరించే బాధ్యత రాష్ట్రాలదే
