తగ్గిన ‘ఉపాధి’ .. రాష్ట్రంలో ఆరు నెలల్లో 47.6 శాతం తగ్గిన పనిదినాలు

తగ్గిన ‘ఉపాధి’ .. రాష్ట్రంలో ఆరు నెలల్లో 47.6 శాతం తగ్గిన పనిదినాలు
  •     వేతనాలు పెరిగినప్పటికీ పనిదినాలు లేక తగ్గిన ఆదాయం 
  •      కూలీలకు ఇబ్బందిగా మారిన ఈ– కేవైసీ విధానం
  •     ఎనిమిది జిల్లాల్లో అత్యధికంగా పడిపోయిన పనిదినాలు
  •     లిబ్టెక్‌‌ ఇండియా నివేదికలో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : వలసలను నివారించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. 2025 ఏప్రిల్‌‌ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో ఉపాధి పని దినాల సంఖ్య గణనీయంగా పడిపోయిందని లిబ్టెక్‌‌ ఇండియా సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ ప్రతి ఆరునెలలకోసారి నివేదిక విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం విడుదల చేసిన రిపోర్ట్‌‌లో పలు అంశాలను వెల్లడించింది.

ఆరు నెలల్లో 47.6 శాతం తగ్గుదల

ఉపాధి హామీ కింద లభించిన పని దినాలు గడిచిన ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 47.6 శాతం తగ్గినట్లు రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా నమోదైన 10.4 శాతం తగ్గుదల కంటే దాదాపు నాలుగు రెట్లు అధికం కావడం గమనార్హం. సాధారణంగా జూలై-, ఆగస్టు నెలల్లో పని దినాలు తగ్గుతుంటాయి. ఈ సారి రాష్ట్రంలో ఏప్రిల్‌‌, -మే నుంచే ఉపాధి పని దినాల సంఖ్య పడిపోయింది. 

ఆ తర్వాత పనుల పునరుద్ధరణ జరగలేదు. దీని ప్రభావం గ్రామీణ కుటుంబాలపై పడింది. స్కీమ్‌‌ కింద ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 25.33 లక్షల నుంచి 19.94 లక్షలకు (21.3శాతం) పడిపోయింది. అంతేకాకుండా.. ఒక్కో కుటుంబానికి లభించిన సగటు పని దినాలు 41 రోజుల నుంచి 27 రోజులకు పడిపోయాయి. 

ప్రతిబంధకంగా ఈ–కేవైసీ నిబంధనలు

డిజిటల్‌‌ సాంకేతికత ఉపాధి కూలీలకు ప్రతిబంధకంగా మారింది. ఒక వైపు జాబ్‌‌ కార్డులు తొలగింపు.. మరోవైపు ఈ–కేవైసీ విధానం అమల్లోకి తీసుకురావడంతో కూలీలకు ఇబ్బందిగా మారిందని రిపోర్ట్‌‌ వెల్లడించింది. 2022–-23లో ఆధార్‌‌ ఆధారిత చెల్లింపుల విధానంతో 5.1 లక్షల జాబ్‌‌కార్డులను తొలగించారు. తర్వాత వీటిని పునరుద్ధరించలేదు. 2025–-26లోనూ కార్డులను తొలగిస్తున్నా.. వాటి స్థానంలో కొత్తవి ఇవ్వలేదు. 

రాష్ట్రంలో 53 లక్షల మందికి పైగా కూలీలు ఇంకా ఈ– కేవైసీ పూర్తి చేయలేదు. దీని వల్ల వారికి జీతాలు ఆలస్యం కావడం లేదంటే పూర్తిగా ఆపేసే అవకాశం ఉందని రిపోర్ట్‌‌లో వెల్లడైంది. రాష్ట్రంలో 48.5 శాతం కూలీలు ఈ– కేవైసీ పూర్తి చేసుకోగా.. జాతీయ స్థాయిలో 29.3 శాతం మాత్రమే పూర్తి చేసుకోవడం విశేషం.

వేతనం పెరిగినా.. తగ్గిన ఆదాయం..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధి హామీ పని దినాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి. వేతనాలు పెరిగినప్పటికీ పని లభించకపోవడంతో ఆదాయం తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. మేడ్చల్ – మల్కాజ్‌‌గిరి జిల్లాలో 92.8 శాతం పని దినాలు పడిపోయాయి. ఈ జిల్లాలోని గ్రామాలన్నీ వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిసి పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మేడ్చల్‌‌ జిల్లా ఉపాధి పనులకు పూర్తిగా దూరమైంది. 

జోగులాంబ గద్వాల జిల్లాలో 72.6 శాతం పని దినాలు తగ్గగా కామారెడ్డి జిల్లాలో 68.7, నిజామాబాద్‌‌లో 67.1, ఆదిలాబాద్‌‌లో 18, నల్గొండలో 24.3, యాదాద్రి భువనగిరిలో 34.3, సిద్దిపేటలో 34.7 శాతం పనిదినాలు తగ్గిపోయాయి. ఉపాధి కూలీల రోజువారీ వేతనాన్ని కేంద్రం రూ.300 నుంచి రూ.307కు పెంచింది. వేతనం పెరిగినప్పటికీ... పని దినాల సంఖ్య తగ్గిపోవడంతో కుటుంబాల ఆదాయం పడిపోయింది. ఒక కుటుంబానికి ఏడాదికి సగటున రూ.1,686 ఆదాయం అంటే 19.4 శాతం తక్కువ వచ్చింది. గతేడాది ఉన్న పని దినాలే కల్పించి ఉంటే.. ప్రతి కుటుంబం అదనంగా రూ.3,515 సంపాదించేదని నివేదికలో వెల్లడైంది.