
- చర్చల తర్వాతే ‘హిట్ అండ్ రన్’ చట్టం అమలుచేస్తామన్న కేంద్ర ప్రభుత్వం
- ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా చర్చలు సక్సెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘హిట్ అండ్ రన్’ చట్టానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగిన ట్రక్కు డ్రైవర్లు తమ స్ట్రైక్ ను విరమించుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రతినిధులతో కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 106/2 సెక్షన్ ను ఇప్పుడే అమలు చేయబోమని ప్రకటించారు. ‘‘ఏఐఎంటీసీ ప్రతినిధులతో మేం చర్చించాం. కొత్త రూల్స్ ను ఇప్పుడే అమలుచేయబోం. దీనిపై యూనియన్ నేతలతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే అమలుప నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన తెలిపారు. ఏఐఎంటీసీ చైర్మన్ బాల్ మల్కిత్ మాట్లాడుతూ.. కొత్త రూల్స్ ఇప్పుడే అమలు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చిందని, దీనికి ఏఐఎంటీసీ కోర్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.
రవాణా వ్యవస్థపై తీవ్ర ఎఫెక్ట్
‘హిట్ అండ్ రన్’ చట్టానికి వ్యతిరేకంగా డ్రైవర్ల స్ట్రైక్‌తో రవాణా వ్యవస్థపై తీవ్ర ఎఫెక్ట్ పడింది. దేశవ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు, నిరసనలు చేపడుతుండటంతో.. ఓవైపు రాకపోకలు నిలిచిపోగా, మరోవైపు చాలా చోట్ల ఇంధన కొరత ఏర్పడింది. పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దీంతో ప్రధాన సిటీలన్నీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. జమ్మూకాశ్మీర్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లో ట్రక్కులు, లారీలు, బస్సులు, క్యాబ్‌ల డ్రైవర్లు సోమవారం నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఎందుకీ నిరసనలు?
బ్రిటీష్ కాలం నాటి ‘ఇండియన్ పీనల్ కోడ్’ స్థానంలో పలు మార్పులతో ‘భారతీయ న్యాయ సంహిత’ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో భారీ పెనాల్టీలు, జైలు శిక్ష విధించేలా నిబంధనలు పొందుపరచడంపై ట్రక్ డ్రైవర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి మూడు రోజులపాటు నిరసనలు నిర్వహించాలని డ్రైవర్ల సంఘాలు నిర్ణయించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో క్యాబ్ ఆపరేటర్లు నిరసనల్లో పాల్గొనడంతో టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లిన వాళ్లదీ ఇదే పరిస్థితి. మహారాష్ట్రవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు రాస్తారోకోలు చేశారు. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్‌పూర్, గోండియా రోడ్లను బ్లాక్ చేశారు. నవీ ముంబైలో మంగళవారం తెల్లవారుజామున ఓ పోలీసుపై కొందరు ట్రక్ డ్రైవర్లు దాడి చేశారు. ముంబై–బెంగళూరు హైవేపై గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా ఫోర్స్‌ను రప్పించారు. థానేలోని ముంబై - అహ్మదాబాద్ హైవేను బ్లాక్ చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. బీహార్‌లోని పాట్నాలో టైర్లను కాల్చి, రోడ్లను బ్లాక్ చేశారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 10 ఏండ్లు తాము జైలులో ఉంటే తమ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు.
అంత ఫైన్ ఎట్ల కట్టాలి?
కొత్త చట్టం ప్రకారం.. హిట్ అండ్ రన్ ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగ్ కేసుల్లో దోషులుగా తేలితే.. నిర్లక్ష్యంతో మరణాలకు కారణమైతే పదేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. రూ.7 లక్షల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ట్రక్, క్యాబ్ డ్రైవర్లు, ఇతర కమెరికల్ వెహికల్ ఆపరేటర్లు వీటినే వ్యతిరేకిస్తున్నారు. కాగా, ట్రక్ డ్రైవర్ల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్రం పేదలను శిక్షిస్తున్నదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ఎంపీలను సస్పెండ్ చేసి.. పార్లమెంటులో ఆమోదించిన ‘డ్రైవర్ల వ్యతిరేక చట్టం’ వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.
పోలీసులకు చెప్తే కఠిన చర్యలు ఉండవు..
ప్రమాదవశాత్తూ ఎవరైనా వ్యక్తిని ఢీకొట్టినప్పుడు.. పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చినా, బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా.. నిందితులపై కఠిన నిబంధనల కింద ప్రాసిక్యూషన్ జరగదని అధికారులు చెప్పారు. ‘‘ప్రమాదం గురించి పోలీసులకు తెలియజేసే డ్రైవర్‌పై కఠినమైన నిబంధనల కింద కేసు నమోదుకాదు. ఒకవేళ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆగినప్పుడు తనపై దాడి జరుగుతుందని డ్రైవర్ భయపడితే.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లవచ్చు లేదా పోలీసులకు కాల్ చేయవచ్చు లేదా టోల్ ఫ్రీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 108కి ఫోన్ చేసి తెలియజేయవచ్చు” అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రమాదం చేసి, సమాచారం ఇవ్వకుండా పరారైతే మాత్రం కఠిన నిబంధనలు వర్తిస్తాయన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైతే కఠిన శిక్ష తప్పదన్నారు.