ఎన్​ఆర్​ఐలు పంపే సొమ్ముపై ఆంక్షలు సడలింపు

ఎన్​ఆర్​ఐలు పంపే సొమ్ముపై ఆంక్షలు సడలింపు

ఎఫ్​సీఆర్​ఏ రూల్స్​కు  కేంద్రం సవరణ

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న ఇండియన్లు ఇకపై మన దేశంలోని బంధువులకు ఏటా రూ.10 లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపుకోవచ్చు. ఈ డబ్బుల గురించి కేంద్రానికి చెప్పాల్సిన అవసరమూ లేదు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి చెప్పకుండా ఏటా రూ.లక్ష మాత్రమే పంపుకొనేందుకు వీలు ఉండగా, తాజాగా ఆ లిమిట్​ను రూ.10 లక్షలకు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఆంక్షలను సడలించింది. ఇప్పటిదాకా రూ. లక్షకు మించి డబ్బులు పంపితే 30 రోజుల్లోగా కేంద్రానికి తెలియజేయాలన్న రూల్ ఉండగా.. ఇకపై రూ.10 లక్షలకు మించి డబ్బులు పంపితే 90 రోజుల్లోగా సర్కారుకు చెప్పాలంటూ పైసల లిమిట్​ను, గడువును పెంచారు. ఫారిన్ కంట్రిబ్యూషన్(రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్​సీఆర్ఏ)లోని రూల్ 6ను కేంద్రం సవరించింది. సవరణలు చేసిన ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్ మెంట్ రూల్స్, 2022ని నోటిఫై చేస్తూ శుక్రవారం రాత్రి గెజిట్ విడుదల చేసింది. 

ఫారిన్ ఫండ్స్ కూ ఆంక్షల సడలింపు  
ఎఫ్​సీఆర్ఏ రూల్ 9 ప్రకారం.. వ్యక్తులు లేదా సంస్థలు, ఎన్జీవోలు విదేశాల నుంచి ఫండ్స్ తీసుకోవాలంటే ప్రస్తుతం 45 రోజులు ముందుగా కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలె. ఆ ఫండ్స్​ దేనికి వాడుకుంటున్నారు? ఏయే అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్ చేయించుకుంటున్నారు? అన్న వివరాలను తెలియజేయాలె. ఇప్పుడు ఈ రూల్​ను కూడా కేంద్రం సవరించింది. ఇకపై 30 రోజులు ముందుగా ఫండ్స్ వివరాలను తెలియజేసి, పర్మిషన్ తీసుకునే వీలు కల్పించింది. ఫారిన్ ఫండ్స్​కు సంబంధించి ఆడిట్ వివరాలను 3 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్​లో డిక్లేర్ చేయాల్సి ఉండగా.. ఇకపై సంబంధిత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 9 నెలల్లోపు డిక్లేర్ చేసేలా సవరణ చేసినట్లు అధికారులు చెప్పారు. ఫారిన్ ఫండ్స్ అందిన తర్వాత బ్యాంకు అకౌంట్లు, పేర్లు, అడ్రస్ లు మారినా, వేరే పనులకు పైసలు ఖర్చు చేసినా.. ఆ వివరాలను 15 రోజుల్లోగా తెలియజేయాల్సి ఉండగా, ఇకపై 45 రోజుల గడువును ఇచ్చారు.