MI vs CSK: గర్జించిన చెన్నై సింహాలు .. ముంబైకి తప్పని ఓటమి

MI vs CSK: గర్జించిన చెన్నై సింహాలు .. ముంబైకి తప్పని ఓటమి

ప్రపంచ క్రికెట్‌లో ఇండియా- పాక్ పోరు ఎలాగో.. ఐపీఎల్ టోర్నీలో ముంబై -చెన్నై సమరం అంతే. ఇది అంగీకరించినా.. అంగీకరించకపోయినా వాస్తవం. ఓడటానికి ఏ జట్టు ఇష్టపడదు. ఆఖరి బంతి వరకూ మ్యాచ్ హోరాహోరీగా సాగాల్సిందే. అనుక్షణం ఇరు జట్ల డగౌట్లలోనూ టెన్షన్ వాతావరణం కనిపించాల్సిందే. అంతేకాదు, మ్యాచ్‌లో బంతి బంతికి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంటుంది. ప్రతి క్షణం వ్యూహాలు మారుతుంటాయి.  అలాంటి దృశ్యాలు.. మరోసారి కనిపించాయి. అందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది.

ఆదివారం(ఏప్రిల్ 14) వాంఖడే గడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మొదట చెన్నై 206 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ముంబై 186 పరుగులకు పరిమితమైంది. పలితంగా 20 పరుగులతో తేడాతో చెన్నై గెలుపొందింది.

ఇటు రుతురాజ్, దూబే.. అటు రోహిత్

మొదట చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్(69), శివమ్ దూబే(66 నాటౌట్) బ్యాట్ ఝుళిపిస్తే.. ముంబై జట్టులో రోహిత్ శర్మ(105 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఇతర బ్యాటర్లు రాణించకపోవడం వల్ల ముంబై ఓడింది వాస్తవమైనా.. చెన్నై బౌలింగ్ దళాన్ని, వారి వ్యూహరచనలను మెచ్చుకోవాల్సిందే.  శ్రీలంక స్పీడ్ గన్ మతీష పతిరాణా(4 వికెట్లు) ఒక్కడే ముంబై ఓటమిని శాసించాడు. ఇరు జట్ల బౌలర్లలో అతనొక్కడే తేడా. 

ధోని మార్క్

చెన్నై గెలిచింది కదా..! ధోని మార్క్ ఉంటదిలే అనుకోకండి.. తన ప్రమేయం లేకపోయినా.. ఈ మాజీ కెప్టెన్ ఫీల్డింగ్‌లో మార్క్ చూపించాడు. మహేంద్రుడు ఎప్పటికప్పుడు తన వ్యూహాలు అమలుపరిచాడు. ముంబైని ఒత్తిడిలోకి నెట్టాడు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ మెరుపులు చెన్నై జట్టుకు మరింత అదనపు బలాన్ని పెంచాయనే చెప్పాలి.  4 బంతుల్లో 20 పరుగులు చేయడం.. ఎంతటి బ్యాటర్‌కైనా అంత తేలికైన విషయం కాదు. మొత్తానికి రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్ అభిమానులకు మంచి మజాను పంచింది.