MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం

MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం

ముల్లన్‌పూర్ గడ్డపై ముంబై బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సూర్య కుమార్ యాద‌వ్(78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 36), తిలక్ వర్మ(18 బంతుల్లో 34 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో హోరెత్తించారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు 192 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి మంచి ఆరంభం లభించ లేదు. భీకర ఫామ్ లో ఉన్న ఇషాన్ కిష‌న్(8).. ర‌బ‌డ బౌలింగ్‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ చేతికి చిక్కాడు. ఆ సమయంలో రోహిత్ శ‌ర్మ(24)తో జత కలిసిన సూర్య కుమార్ యాద‌వ్(22) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. తనదైన షాట్లతో పంజాబ్ బౌలర్లను చితక్కొట్టాడు. వీరిద్దరి ధాటికి ముంబై 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం వేగంగా  ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ (36) వెనుదిరిగాడు. సామ్‌ కరన్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్‌ బ్రార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 99 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

అక్కడినుంచి సూర్య- తిలక్ వర్మ(34 నాటౌట్) జోడి ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున స్కోర్ చేస్తూ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. చివరలో సూర్య వెనుదిరిగినా.. టిమ్ డేవిడ్(14; 7 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) అలరించాడు. సామ్ కరణ్ వేసిన 19వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు.  అయితే, ఆఖరి ఓవర్‌ను హర్షల్ పటేల్ కట్టడి చేయడంతో ముంబై 200 పరుగులు దాటలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరణ్ 2, రబడ ఒక వికెట్ తీసుకున్నారు.