IPL 2024: పాక్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ఆడుకోవడం నయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

IPL 2024:  పాక్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ఆడుకోవడం నయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ఐపీఎల్ లో కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు మిస్సయిన సంగతి తెలిసిందే. ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు ఇంగ్లాండ్ క్రికెటర్లు లేని లోటు ఆయా జట్లలో స్పష్టంగా కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు ఫామ్ లో ఉన్న ఇంగ్లీష్ ఆటగాళ్ల సేవలను కోల్పోవడం ఆయా జట్ల విజయావకాశాలపై దెబ్బ తీశాయి. పాకిస్థాన్ తో అంతర్జాతీయ టీ20 సిరీస్ ఉండడమే దీనికి కారణం.

వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావించింది. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ లోనే ఉండాల్సిందని ఆయన భావించారు. బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఫిల్ సాల్ట్ (కేకేఆర్) తమ జట్లను ప్లేఆఫ్‌లకు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు.  కానీ జాతీయ విధుల కారణంగా వీరు ఐపీఎల్ ఆడలేకపోయారు. పాకిస్థాన్‌తో టీ20 ఆడడం కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఆడడం మంచి ప్రాక్టీస్ అని వాన్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. క్వాలిఫయర్ 2 లో బట్లర్ అనుభవం లేకపోవడంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అతని స్థానంలో వచ్చిన కేడ్మోరే తీవ్రంగా నిరాశపరిచాడు. జాక్స్, టోప్లీ లేకుండానే ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది. జాక్స్ స్థానంలో వచ్చిన మ్యాక్స్ వెల్ దారుణంగా విఫలమయ్యాడు. కేకేఆర్ తరపున ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన సాల్ట్ లేకుండానే క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో సాల్ట్ స్థానంలో వచ్చిన గర్భాజ్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేర్చాడు. 

లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, ఫిల్ సాల్ట్  పంజాబ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి వెళ్లిపోయారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు ప్రతి సీజన్ లో ఇలా మధ్యలోనే వైదొలగడంతో సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండండి. లేకపోతే ఐపీఎల్ కు రావద్దు అని పఠాన్ కామెంట్ చేశాడు.