- డ్రిప్, స్ప్రింక్లర్ సేద్యానికి 5 హెక్టార్ల వరకు కేంద్రం ఆర్థిక సాయం
- చిన్న, సన్నకారు రైతులకు 55%, ఇతరులకు 45% సబ్సిడీ
- కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సమాచారంపై పీఐబీ ఫీల్డ్ రిపోర్ట్
న్యూఢిల్లీ, వెలుగు: వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి, పంటల ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్(పీడీఎంసీ)’ స్కీమ్ క్రమంగా విస్తరిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. పోయిన నెల నాటికి దేశవ్యాప్తంగా115 లక్షల హెక్టార్ల (సుమారు 2.84 కోట్ల ఎకరాలు)భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఇది దేశ నికర సాగు విస్తీర్ణంలో సుమారు 8.11 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు శనివారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అందించిన సమాచారంపై ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)’ క్షేత్రస్థాయి నివేదికను రూపొందించింది. దేశంలో అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో 80 శాతానికి పైగా సేద్యానికే వినియోగమవుతున్నాయని తెలిపింది. అయితే నికర సాగు విస్తీర్ణంలో సుమారు 50 శాతానికే సాగునీటి సౌకర్యం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం జాతీయ ప్రాధాన్యంగా మారిందని, పంటలకు అవసరమైన నీటిని నేరుగా మొక్కల వేర్ల ప్రాంతానికి అందించి నష్టాలను తగ్గించే డ్రిప్, స్ప్రింక్లర్ విధానాలను పీడీఎంసీ ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించింది.
5 హెక్టార్ల వరకు సాయం
పీడీఎంసీ స్కీమ్ కింద ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా 5 హెక్టార్ల వరకు సూక్ష్మ సేద్య వ్యవస్థ ఏర్పాటుకు ఆర్థిక సాయం అందుతుందని కేంద్రం తెలిపింది. చిన్న, సన్నకారు రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం సాయం అందిస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా గత మూడేళ్లలో కేంద్రం నుంచి రూ.8,123.24 కోట్లు విడుదలయ్యాయి. కొన్ని రాష్ట్రాలు తమ బడ్జెట్ల నుంచి అదనపు సబ్సిడీలను అందిస్తున్నాయి. ఒకే భూమికి 7 ఏండ్ల తర్వాత మళ్లీ సాయం పొందే అవకాశం ఉంది. 2006 జనవరిలో మైక్రో ఇరిగేషన్‌కు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
2010–11లో నేషనల్ మిషన్ ఆన్ మైక్రో ఇరిగేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. 2014–15లో నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్‌లోని ‘ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్‌మెంట్’లో భాగమైంది. 2015–16 నుంచి 2021–22 వరకు పీడీఎంసీగా, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనలో భాగంగా అమలైంది. 2022–23 నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎం-ఆర్‌కేవీవై) కింద కొనసాగుతోన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తొమ్మిది స్కీంలను ఒకే గొడుకు కిందకు చేర్చి.. రూపొందించిన దానిలో పీడీఎంసీతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ, భూసార ఆరోగ్య నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, అగ్రి -స్టార్టప్‌ల కోసం యాక్సిలరేటర్ ఫండ్ వంటివి ఉన్నట్లు పీఐబీ పేర్కొంది. 2025–26లో పీఎం-ఆర్‌కేవీవై కింద రూ.8,957.72 కోట్లు విడుదల/మంజూరు కాగా, అందులో పీడీఎంసీకి రూ.3,226.36 కోట్లు కేటాయించారని పీఐబీ తెలిపింది.
నీటి పొదుపు.. ఫెర్టిగేషన్
పంటల ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పీడీఎంసీ ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. నీటితో పాటు ఎరువులను మొక్కల వేర్ల ప్రాంతానికి నేరుగా అందించే ఫెర్టిగేషన్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. నీటి కొరత, భూగర్భ జలాల ఒత్తిడి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ట్యూబ్ వెల్, నదుల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, సౌరశక్తి ఆధారిత సేద్య వ్యవస్థలతో సూక్ష్మ సేద్యాన్ని అనుసంధానించడంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలతో సమన్వయాన్ని ప్రోత్సహిస్తోంది.
2025–26లో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 12.30 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. పోర్టబుల్, మైక్రో, మినీ, సెమీ-పర్మనెంట్, లార్జ్ వాల్యూమ్ స్ప్రింక్లర్లు ఇందులో ఉన్నాయి. మైక్రో స్ప్రింక్లర్లు ఆకు కూరలు, నర్సరీలు, మొక్కల పెంపకంలో ఉపయోగపడతాయి. మినీ స్ప్రింక్లర్లు వేరుశెనగ, బంగాళాదుంప, ఉల్లి, అల్లం వంటి పంటలకు అనుకూలం. లార్జ్ వాల్యూమ్ స్ప్రింక్లర్లు ఒకటి లేదా రెండు స్ప్రింక్లర్లతో పెద్ద విస్తీర్ణానికి తక్కువ సమయంలో నీరు అందించేందుకు ఉపయోగిస్తారు.
