మైక్రాన్​ చిప్​ ఫెసిలిటీకి త్వరలో ఓకే.. 3 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు

మైక్రాన్​ చిప్​ ఫెసిలిటీకి త్వరలో ఓకే.. 3 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: అమెరికా సెమీకండక్టర్ కంపెనీ మైక్రాన్​ మన దేశంలో 3 బిలియన్​ డాలర్లతో పెట్టనున్న సెమీకండక్టర్​ అసెంబ్లీ అండ్​ టెస్ట్​ (ఓఎస్​ఏటీ) యూనిట్​కు ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వనుంది. ఈ కంపెనీ తొలి దశలో 2.5 బిలియన్​ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. రాబోయే అయిదేళ్లలో ఆ పెట్టుబడులను పెంచాలని ప్లాన్​చేస్తోందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దేశంలో సెమీకండక్టర్​ మాన్యుఫాక్చరింగ్​కు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం రూ. 76 వేల కోట్ల ప్యాకేజ్​ ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రాన్​ సీనియర్​ అధికారులు మన ప్రభుత్వ అధికారుల మధ్య చాలా దఫాలు చర్చలు జరిగాయి. 

పెట్టుబడుల ప్లాన్, యూనిట్​ కెపాసిటీ ఎంతో  చెప్పాలని, తమ నుంచి ఏం కోరుకుంటోందో కూడా వెల్లడించాలని మైక్రాన్​ను కోరామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.  ఓఎస్​ఏటీ యూనిట్లు అనేవి సెమికండక్టర్​ మాన్యుఫాక్చరింగ్​ చెయిన్​లో చాలా ముఖ్యమైన లింక్​.  సిలికాన్​ చిప్స్​ టెస్టింగ్, ప్యాకింగ్​ వంటి కీలకమైన టాస్క్​లను ఈ ఓఎస్​ఏటీలు నిర్వహిస్తాయి. సెమీకండక్టర్​ యూనిట్ పెట్టడానికి 10 నుంచి 15  బిలియన్​ డాలర్ల దాకా పెట్టుబడి అవసరమైతే, ఈ ఓఎస్​ఏటీ పెట్టడానికి 5 బిలియన్​ డాలర్లు సరిపోతుంది. మైక్రాన్​ ప్రపోజల్స్​ ఇంచుమించుగా నచ్చాయని, అనుమతి ఇవ్వడం లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్​లో 1978 లో ఏర్పాటయిన మైక్రాన్​కు ఇండియాలో ఇప్పటికే బెంగళూరులో ఒకటి, హైదరాబాద్​లో రెండు ఆఫీసులున్నాయి.