- చాట్ జీపీలో జతతో మైక్రోసాఫ్ట్బింగ్ దూసుకెళ్తుందా!
- సెర్చ్ లో కొత్త శకం మొదలైనట్లేనా..!
వెలుగు బిజినెస్ డెస్క్: ఇరవై ఏళ్ల పాటు సెర్చ్ ఇంజిన్ బిజినెస్‌లో గుత్తాధిపత్యం నడిపిన గూగుల్ సెర్చ్‌కి తెరపడనుందా....ఇంటర్నెట్కు ఫ్రంట్డోర్గా మారిన గూగుల్‌కి ఇక కష్టకాలమేనా....అంటే అవుననే చెబుతున్నారు ఎక్స్పర్టులు. ఈ ఇరవై ఏళ్ల నుంచి ఇన్వెస్టర్లకు గూగుల్ లాభాలు పండిస్తూనే ఉంది. సెకనుకు లక్ష వెబ్ సెర్చ్‌లను సక్సెస్‌ఫుల్‌గా గూగుల్ ప్రాసెస్ చేస్తోందంటే...ఆ కంపెనీ ఆల్గారిథమ్స్ ఎంత తెలి వైనవో అర్ధం చేసుకోవచ్చు. మనం అడిగే ప్రశ్నలకు వీలయినంత వరకూ అర్థవంతమైన జవాబులను గూగుల్ సెర్చ్ ఇవ్వగలుగుతోంది కూడా. దీని వల్లే సెర్చ్ అంటే గూగుల్, గూగుల్ అంటే సెర్చ్...అనేలా మనం అందరం మారిపోయేలా చేయగలిగింది. ప్రశ్నలకు జవాబులివ్వడంతోపాటే, కోట్ల కొద్దీ ఆపర్చునిటీస్ను యాడ్స్ రూపంలో జనాలకి అందిస్తోంది గూగుల్. సెర్చ్ రిజల్ట్స్‌లోని యాక్యురెసీ వల్లే యూజర్లు మళ్లీ...మళ్లీ ...గూగుల్ వైపే చూస్తున్నారు..అంతేకాదు, పోటీదారులు ఆమడదూరంలోనే ఇప్పటిదాకా నిలిచిపోవల్సి వచ్చింది. పోటీ సెర్చ్ ఇంజిన్స్ అన్నింటికీ కలిపి కంపెనీ రోజు వారీ సెర్చ్‌లలో పదో వంతు కూడా వాటా లేదంటే గూగుల్ గుత్తాధిపత్యాన్ని ఈజీగానే తెలుసుకోవచ్చు. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ రెవెన్యూ 2011 నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. ఈ కాలంలో ఈ కంపెనీ ఆపరేటింగ్ ఖర్చులు పోను 300 బిలియన్ డాలర్ల క్యాష్‌ను జనరేట్ చేసింది. ఇందులో ఎక్కువ భాగం సెర్చ్ నుంచి వచ్చిందే. ఇదే టైములో కంపెనీ మార్కెట్ వాల్యూ కూడా మూడు రెట్లయి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే నాలుగో విలువైన కంపెనీగానూ అవతరించింది గూగుల్. ఇంత సక్సెస్ కావడం వల్లే తనని తాను కనుగొనాల్సిన అవసరం ఇప్పటిదాకా గూగుల్‌కి రాలేదని చెప్పుకోవచ్చు.
వచ్చింది బింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలల్లోనే గూగుల్ తన భవిష్యత్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. గూగుల్ హెడ్ క్వార్టర్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్. ఓపెన్ఏఐ అనే స్టార్టప్ కంపెనీ ఈ చాట్‌జీపీటీని డెవలప్ చేసింది. ఒకప్పుడు గూగుల్ సృష్టించిన సంచలనాన్నే ఇప్పుడు చాట్‌జీపీటీ సృష్టిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత నుంచి కంప్యూటర్ కోడింగ్ దాకా ...అడిగినవన్నీ ఇచ్చేస్తోంది చాట్‌జీపీటీ..నవంబర్2022 లో మార్కెట్లోకి ఎంటరయినప్పటి నుంచీ ఇప్పటిదాకా 100 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను ఇది సంపాదించుకుంది. టిక్ టాక్ వంటి సోషల్ మీడియా సెన్సేషన్‌కు సైతం ఈ ఫీట్ సాధించడానికి 9 నెలలు పట్టింది. పర్సనల్ కంప్యూటర్, ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంటో..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ఇంపార్టెంటని మైక్రోసాఫ్ట్కో ఫౌండర్ బిల్ గేట్స్ స్వయంగా చెప్పారు. మనిషిలాగే ఆలోచించగలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఫ్రెండ్‌గా మారిపోతోందని, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అధిపత్యానికి ఇక తెరపడుతున్నట్లేనని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిడ్ పేర్కొన్నారు. యూజర్ల ప్రశ్నలకు గూగుల్ ఎలా జవాబులు ఇవ్వగలుగుతోందో, అదేలా చాట్‌జీపీటీ కూడా ఇవ్వగలదు. చాట్‌జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ ఇటీవలే మైక్రోసాఫ్ట్‌తో జతకట్టింది. సెర్చ్ బిజినెస్‌లో గూగుల్ రెవెన్యూకి గండి కొట్టాలని మైక్రోసాఫ్ట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోంది. ఓపెన్ఏఐలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఫిబ్రవరి 7 న ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌లో ఇప్పుడు ఏఐ జనరేటెడ్ సైడ్ బాక్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఓపెన్ఏఐ మోడల్స్‌తో బింగ్ తన సొంత చాట్బాట్నూ డెవలప్చేస్తోంది. సెర్చ్‌లో ఇదొక కొత్త రోజని ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. పోటీగా ఆల్ఫాబెట్ (గూగుల్ పేరెంట్ కంపెనీ) తన సొంత చాట్‌బాట్ బార్డ్‌ను లాంచ్ చేసింది. అంతేకాదు ఏఐ స్టార్టప్ కంపెనీ యాంథ్రోపిక్లో ఈ కంపెనీ 300 మిలియన్ డాలర్లను పెట్టుబడిగానూ పెట్టింది. బార్డ్‌ను త్వరలోనే సెర్చ్ ఫీచర్లలో భాగం చేయనున్నట్లు ఫిబ్రవరి 8 న లాంఛ్ సందర్భంగా గూగుల్ఎనౌన్స్ చేసింది. కానీ, ఆల్ఫాబెట్ ఇన్వెస్టర్లు దీనితో సంతృప్తి చెందలేదు. బార్డ్ లాంఛ్ ఎనౌన్స్మెంట్ తర్వాత ఆల్ఫాబెట్ కంపెనీ షేర్లు 8 శాతం పతనమయ్యాయి.
‘కన్వర్సేషనల్’ సెర్చ్....ఒక కొత్త శకం
కన్వర్సేషనల్ సెర్చ్ తాజాగా న్యూ కమర్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. సెర్చ్, జనరేటివ్ కంటెంట్ మార్కెట్ దీంతో బాగా విస్తరిస్తోంది. రెండేళ్ల కిందట నేను కంపెనీ పెట్టినప్పుడు అందరూ నన్ను క్రేజీ అన్నారు. ఇప్పుడు సెంటిమెంట్ పూర్తిగా షిఫ్టయిందని ఏఐ పవర్డ్సెర్చ్ చాట్‌బాట్ వైఓయూ.కామ్ ఫౌండర్ రిచర్డ్ సోచర్ చెప్పారు. ఇప్పటికే మార్కెట్లోకి మరి కొన్ని సెర్చ్ చాట్బాట్లు ఎంటరయ్యాయి. నీవా, సీ3.ఏఐ వంటివి ఈ జాబితాలో చేరాయి. వీటన్నింటిలోనూ గూగుల్ అధిపత్యానికి గండికొట్టే కెపాసిటీ ఉన్నది మైక్రోసాఫ్టేనని ఎక్స్పర్టుల అభిప్రాయం. భవిష్యత్‌లో బింగ్ వాటాను మైక్రోసాఫ్ట్ భారీగా పెంచుకోగలుగుతుందని వారు చెబుతున్నారు.
