సర్కారు స్కూళ్లలో .. మిడ్​ డే మీల్స్​ బంద్

సర్కారు స్కూళ్లలో .. మిడ్​ డే మీల్స్​ బంద్
  • ప్రభుత్వం నుంచి బిల్లులు రాక సమ్మెబాట పట్టిన కార్మికులు
  • ఇంటి నుంచి టిఫిన్ బాక్స్​లు తెచ్చుకుంటున్న స్టూడెంట్లు
  • ఏడెనిమిది నెలలుగా బిల్లులు పెండింగ్​
  • పెంచిన గౌరవ వేతనం కూడా ఇస్తలే
  • ఇన్నాళ్లూ అప్పులు తెచ్చి వండి పెట్టిన కార్మికులు
  • వడ్డీలు కట్టలేక తిప్పలు పడ్తున్నామని ఆవేదన
  • మిడ్ డే మీల్స్​ కార్మికుల డిమాండ్లు!
  • జీవో నెం. 8 ప్రకారం వేతనాలను ఏరియర్స్ తో పాటు చెల్లించాలి. 
  • పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. కొత్త మెనూను సవరించాలి.
  • గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. అవసరమైన గ్యాస్​ను సబ్సిడీపై ఇవ్వాలి.
  • వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలి.
  • ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి

కరీంనగర్ /  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం బంద్ అయింది. ఏడెనిమిది నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం, పెరిగిన ధరలకు తగ్గట్టుగా చార్జీలు పెంచకపోవడంతో మిడ్​ డే మిల్స్​ కార్మికులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు తెచ్చి స్టూడెంట్స్ కు భోజనం వండి పెట్టినా.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, ఇక తమకు స్థోమత లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, ఇంకా ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు. కార్మికుల సమ్మెతో సోమవారం మధ్యాహ్నం చాలా స్కూళ్లలో స్టూడెంట్లు ఇండ్ల దగ్గరి నుంచి టిఫిన్​ బాక్సులు తెచ్చుకొని తిన్నారు. కొందరికి విషయం తెలియక బాక్స్ లు తెచ్చుకోలేదు. కొన్ని స్కూళ్లలోనైతే  టీచర్లు,  స్టూడెంట్లే వంట మనుషులుగా అవతారమెత్తాల్సి వచ్చింది.

‘మిడ్ డే మీల్స్’ కు 20 లక్షల మంది దూరం 

రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ స్కూళ్లుండగా.. వాటిలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలవుతున్నది. ఆయా బడుల్లో పిల్లలకు వంట చేసేందుకు 54,201 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 

మిడ్ డే మీల్స్ నిర్వహణ కోసం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఒక్కో స్టూడెంట్​కు రోజుకు రూ.5.45,  ఆరు నుంచి 8వ తరగతి వరకూ రూ. 8.17, తొమ్మిది, పది తరగతుల స్టూడెంట్లకు రూ.10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంటుంది. కార్మికులు ప్రతి నెలా ముందుగా ఖర్చు పెట్టుకొని, ఆ తర్వాత సర్కారు ఇచ్చినప్పుడు తీసుకుంటారు. అయితే, ప్రతినెలా ఇవ్వాల్సిన బిల్లులను ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్​లో పెట్టడంతో అప్పులు తెచ్చిపెట్టిన కార్మికులు.. మిత్తి కట్టలేక అవస్థలు పడుతున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు వంద స్కూళ్ల వరకూ మిడ్ డే మీల్స్ బంద్ చేశారు. చాలా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అప్పులు కట్టేందుకు బంగారం, కాళ్ల పట్టీలు, చెవి దిద్దులను రూ. లక్షకు కుదువ పెట్టానని కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ హైస్కూల్​లో మిడ్​ డే మీల్స్​ వర్కర్​ గడ్డం రాధ వాపోయారు.  పాత అప్పులు దాదాపు రూ. 2 లక్షలు ఉన్నాయని, సరుకుల కోసం రూ. 15 వేలకు చెవి దిద్దులను కుదువ పెట్టాలని సారపాక జెడ్పీహెచ్​ఎస్​ మిడ్​ డే మీల్స్​ వర్కర్​ ఆకుల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కో జిల్లాలో రూ. 2 కోట్ల నుంచి

 10 కోట్లు బాకీ

మిడ్​ డే మీల్స్​కు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 150 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఒక్కో జిల్లాలో రూ. 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బాకీలు ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు సంబంధించిన బిల్లులే ఫిబ్రవరి నుంచి పెండింగ్​లో ఉన్నాయి. ఇవి సుమారు రూ. 76 కోట్లు. వీటి కోసం ఇటీవల రూ.15 కోట్లు రిలీజ్ చేసినా.. ఆ డబ్బులు ఇంకా కార్మికుల ఖాతాల్లోకి చేరలేదు. 9,10 తరగతుల స్టూడెంట్లకు సంబంధించినవి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి రావడం లేదు. ఈ బాకీలు సుమారు రూ. 30 కోట్లు. విద్యార్థులకు అందించే గుడ్ల బిల్లులు అక్టోబర్ నుంచి రూ.25 కోట్ల దాకా పెండింగ్​లో ఉన్నాయి. అట్లనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి కార్మికుల గౌరవ వేతనం రూ. 50 కోట్ల మేర పెండింగ్ లో ఉంది.  

గౌరవ వేతనాల జీవో అమలు కావట్లే..!

మిడ్ డే మీల్స్ కార్మికులకు ప్రస్తుతం రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం అమలులో ఉంది. ఇందులో రూ. 600 కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రూ.400 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 15 ఏండ్ల నుంచి వీరికి అదే వెయ్యి చొప్పున ఇస్తున్నారు. అయితే, కార్మికుల ఆందోళనలతో నిరుడు అసెంబ్లీలో మిడ్ డే మీల్స్ కార్మికులకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల గౌరవ వేతనం అందిస్తామని  ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 2 వేలు అదనంగా ఇచ్చేందుకు వీలుగా జీవోను రిలీజ్ చేసింది. అయితే, ఆ జీవో ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది క్లారిటీ లేదు.

ఆందోళన బాట

డిమాండ్ల పరిష్కారం కోసం సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10,11,12 తేదీల్లో టోకెన్ సమ్మె నిర్వహిస్తామని సీఐటీయూ నేతలు ప్రకటించారు.  ప్రస్తుతం మండల కేంద్రాల్లో నిరసనలు చేస్తుండగా, 12న కలెక్టరేట్ల ముందు ధర్నా చేపడుతామని తెలిపారు. మరోపక్క ఈ నెల12న ‘చలో హైదరాబాద్’​ పేరుతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఏఐటీయూసీ వెల్లడించింది. 

వంట వండిన టీచర్లు

వంట బిల్లులు రావడం లేదని మిడ్​ డే మీల్స్​ కార్మికులు సోమవారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగడంతో మంచిర్యాల  జిల్లా నెన్నెల మండలంలోని మైలారం, నెన్నెల జెడ్పీఎస్ఎస్​ స్కూళ్లలో టీచర్లే వంట మాస్టర్లుగా మారారు. వంట చేసి స్టూడెంట్లకు వడ్డించారు. కాగా, పెండింగ్​ బిల్లులను, గౌరవ వేతానాన్ని విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ  ఆదిలాబాద్​కలెక్టరేట్ వద్ద మిడ్​డే మీల్స్ కార్మికులు ధర్నాకు దిగారు. 

- బెల్లంపల్లి రూరల్ / ఆదిలాబాద్​ టౌన్​

అప్పు చేసి పెడ్తున్నా ప్రభుత్వానికి కనికరం లేదు

కూరగాయలు, గుడ్లు ఇతరత్రా అన్ని బకాయిలు కలిపి మాకు దాదాపు రూ. రెండు లక్షల వరకు రావాల్సి ఉంది. అప్పు చేసి పెడుతున్నం. అయినా ప్రభుత్వానికి కనికరం లేదు. బిల్లులు ఇవ్వాలని ఎన్నిసార్లు గవర్నమెంట్​కు విన్నవించినా ఫాయిదా ఉంటలేదు. 

నాగరత్నం, హేమచంద్రపురం    స్కూల్, భద్రాద్రి కొత్తగూడెం 

అక్టోబర్​ నుంచి బకాయిలు..​

కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే సమ్మెబాట పట్టాం. అక్టోబర్ నుంచి  మిడ్​ డే మీల్స్ బకాయిలు ఉన్నాయి. పిల్లల కోసం కార్మికులు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వండి పెడుతున్నారు. కొత్త మెనూను సవరించి, గుడ్లను 
ప్రభుత్వమే సరఫరా చేయాలి. 

 ఎస్వీ రమ, మిడ్​ డే మీల్స్ కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి