సర్కారు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోని మిడ్‌ డే మీల్స్ కార్మికులు

సర్కారు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోని మిడ్‌ డే మీల్స్ కార్మికులు

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో మిడ్‌ డే మీల్స్ వండిపెడుతున్న కార్మికులకు గౌరవవేతన పెంపుపై సర్కారు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ గతేడాది అసెంబ్లీలో రూ.2 వేలు పెంచుతామని ప్రకటించినా,  నాలుగు నెలల క్రితం అధికారికంగా జీవో ఇచ్చినా.. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించలేదు. మరోపక్క గతేడాది వేతన, ఇతర బిల్లుల బకాయిలూ భారీగానే ఉన్నాయి. దీంతో మిడ్‌ డే మీల్స్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కార్మికుల పోరాటాలతో జీవో

రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు స్కూళ్లు ఉండగా, వాటిలో 54,201 మంది మధ్యాహ్నాభోజన కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 19 లక్షల మంది స్టూడెంట్లు మిడ్‌ డే మీల్స్ తింటున్నారు. ప్రస్తుతం ఒక్కో కార్మికునికి నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. దీంట్లో రూ.600 కేంద్రం ఇస్తుండగా, రూ.400 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు 15 ఏండ్ల నుంచి ఒకే వేతనంతో పనిచేస్తున్న వారంతా, తమకు కనీస వేతనాలు ఇవ్వాలని అనేక ఆందోళనలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గతేడాది అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మిడ్‌ డే మీల్స్ కార్మికులకు రూ.2 వేల వేతనం పెంచుతామని ప్రకటించారు. ఆ మాట ఉత్తర్వుల రూపంలోకి రావడానికి ఏడాది పట్టింది. దీని కోసం కార్మికులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్మికులకు రూ.2 వేలు పెంచుతున్నట్టు జీవో నంబర్ 8 రిలీజ్ చేశారు. ఆ జీవోలో ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క కేంద్రానికి మాత్రం ప్రస్తుతం ఇస్తున్న గౌరవవేతనానికి అదనంగా రూ.2 వేలు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది. అయితే సీఎం కేసీఆర్ గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించారని అప్పటి నుంచి అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

15 ఏండ్లుగా వెయ్యే..

మిడ్‌డే మీల్స్ ప్రారంభ సమయంలో రెండు, మూడేండ్లు ఉచితంగానే కార్మికులు పిల్లలకు భోజనం వండిపెట్టారు. తర్వాత 2008 నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇది కూడా 10 నెలలకు మాత్రమే అందిస్తున్నారు. కార్మికుల ఆందోళనలతో సీఎం కేసీఆర్ గతేడాది గౌరవ వేతనం మరో రూ.2 వేలు పెంచుతున్నట్టు ప్రకటించారు. పెంచిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 20 రాష్ట్రాల్లో రూ.వెయ్యి కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారు. కేవలం ఇక్కడే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న సర్కారు.. దాన్ని అమలు చేయకపోవడంపై కార్మికుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మరోపక్క మార్చి, ఏప్రిల్ నెలల వేతనాలు కూడా ఇంకా కార్మికులకు అందలేదు. అయితే, పెంచిన వేతనాలకు సంబంధించిన బడ్జెట్​కు ప్రతిపాదనలను విద్యాశాఖ అధికారులు సర్కారుకు పంపిస్తే, దాన్ని తిప్పిపంపించారు. దీంతో పెంచిన వేతనాల జీవో ఎప్పటి నుంచి అమలవుతుందనే దానిపై స్పష్టత కరువైంది.

పెంచిన వేతనాలు వెంటనే ఇవ్వాలె

కార్మికుల అనేక ఆందోళనల ఫలితంగా సీఎం కేసీఆర్ గతేడాది రూ.2వేలు పెంచుతామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో జీవో నంబర్​8 ను విడుదల చేశారు. అయినా, ఇప్పటికీ పెరిగిన జీతం రాలేదు. సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి అమలు చేయాలి. పెండింగ్ లోని వేతనాలు, బిల్స్ ను వెంటనే రిలీజ్ చేయాలి.

‑ కవిత, రాష్ట్ర కార్యదర్శి, మిడ్‌డే మీల్స్​ కార్మికుల యూనియన్