
ఏపీలో గన్ కల్చర్ కలకలం రేపుతోంది. గడిచిన వారం రోజుల్లో గన్ ఫైరింగ్స్ లో ఇద్దరు మృతి చెందటం రాష్ట్రంలో పెరుగుతున్న గన్ కల్చర్ కు ఉదాహరణగా నిలుస్తోంది. మంగళవారం ( ఆగస్టు 5 ) విజయనగరం జిల్లాలో అర్థరాత్రి కాల్పుల కలకలం రేగింది. బంధువుల మధ్య ఆస్తి వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం ముసిరాంలో చోటు చేసుకుంది ఈ ఘటన.
ఆస్తి వివాదంలో నాటు తుపాకులతో కాల్పులు జరపడంతో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందారు. సమీప బంధువే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు అప్పారావు కోసం గాలిస్తున్నారు పోలీసులు. గడిచిన వారం రోజుల్లోనే ఇది రెండో గన్ ఫైరింగ్ కావడంతో ఆందోళనకు గురవుతున్నారు జనం.
వారం రోజుల్లోనే వరుసగా రెండుసార్లు కాల్పులు జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఏపీలో కూడా గన్ కల్చర్ పెరుగుతోందని.. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రశాంతంగా బతకలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. గన్ కల్చర్ ను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.