- ముడిసరుకులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఒత్తిడిలో కంపెనీలు
- షిప్‌మెంట్లు సగటున 5 శాతం మేర పడిపోయే అవకాశం
న్యూఢిల్లీ: ధరలు విపరీతంగా పెరగడంతో టీవీలకు గిరాకీ తగ్గింది. మెమరీ చిప్స్ (ర్యామ్) రేట్లు పెరగడం, వెస్ట్ ఏషియా ఉద్రిక్తతల కారణంగా సముద్ర రవాణా ఖర్చులు, ప్లాస్టిక్ ఖర్చులు కూడా పెరగడం వలన టీవీల ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీటికితోడు రూపాయి విలువ తగ్గడంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి–-మార్చిలో టీవీ షిప్‌మెంట్లు 3–-5 శాతం, ఏప్రిల్–-జూన్‌లో 5–-6 శాతం పడిపోతాయని, సగటున 5 శాతం తగ్గుదల ఉంటుందని రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో డిమాండ్ రికవర్ అయ్యే అవకాశం ఉందని, ఈఎంఐ వంటి ఫైనాన్షింగ్ ఆప్షన్ల వలన 45 ఇంచుల కంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న టీవీలకు డిమాండ్ కొనసాగుతుందని తెలిపింది.
గత మూడు నెలల్లో భారతదేశంలో టీవీల ధరలు సగటున 5శాతం–7శాతం వరకు పెరిగాయి. చిన్న స్క్రీన్ మోడళ్లలో రూ.2 వేల వరకు పెరుగుదల కనిపించగా, పెద్ద స్క్రీన్ మోడళ్లలో రూ.5 వేల–7 వేల వరకు ధరలు పెరిగాయి. ధరలు పెరగడంతో వినియోగదారులు పెద్ద స్క్రీన్ టీవీల కొనుగోలును వాయిదా వేసి, చిన్న స్క్రీన్ మోడళ్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఎనలిస్టులు తెలిపారు. ఉదాహరణకు, 55 అంగుళాల టీవీ కొనాలనుకున్నవారు ఇప్పుడు 50 అంగుళాల మోడల్ ఎంచుకుంటున్నారని, 65 అంగుళాల టీవీ ఆలోచించినవారు 55 అంగుళాల మోడల్‌కి షిఫ్ట్ అవుతున్నారని వివరించారు. అయితే, పెద్ద బ్రాండ్లు కొంతవరకు ఖర్చు ఒత్తిడిని భరించి, వినియోగదారులపై కొంత భారం మోపుతున్నా, డిమాండ్ మాత్రం తగ్గిందన్నారు. ‘‘ఈఎంఐ వంటి ఫైనాన్సింగ్ ఆప్షన్లు వినియోగదారులకు కొంత ఉపశమనం ఇస్తున్నాయి. ధరలు రూ.5 వేల వరకు పెరిగినా ఈఎంఐ ద్వారా అది మూడు అదనపు ఇన్‌స్టాల్‌మెంట్లుగా మాత్రమే మారుతుంది. కాబట్టి కొంత మంది కన్జూమర్లు ఈఎంఐ ఆప్షన్ ద్వారా పెద్ద స్క్రీన్ టీవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని అంచనావేస్తున్నాం”అని హయర్ ఇండియా అధ్యక్షుడు ఎన్‌ఎస్ సతీష్ వివరించారు.
