మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు మిడ్​ వైఫరీలు : దామోదర రాజ నర్సింహ

మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు మిడ్​ వైఫరీలు  :  దామోదర రాజ నర్సింహ

పద్మారావునగర్​, వెలుగు :  మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు మిడ్​ వైఫరీ వ్యవస్థ ఎంతో గొప్పగా పని చేస్తుందని, రాష్ట్రంలో మరిన్ని మిడ్​ వైఫరీ ట్రైనింగ్​ఇనిస్టిట్యూట్​ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. న్యూ బోయిగూడలో ఏర్పాటు చేసిన  నేషనల్ ​మిడ్ ​వైఫరీ ట్రైనింగ్​ ఇనిస్టిట్యూట్​ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని మిడ్​ వైఫరీ ఇనిస్టిట్యూట్​లలో ఇది ఐదోది అని, రాష్ట్రంలో మొదటిదని తెలిపారు. బోయిగూడలోని పాత గాంధీ మెడికల్​కాలేజీ బాలికల హాస్టల్​భవనంలో హెల్త్, ఫ్యామిలీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ 1.50 కోట్లతో మరమ్మతులు, శిక్షణా కేంద్రానికి అవసరమైన సౌకర్యాలను కల్పించారు. 

మాత, శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి, గర్భిణులకు ప్రసవ సమయంలో సీ సెక్షన్​ ఆపరేషన్లను తగ్గించి, నార్మల్​డెలివరీలను ప్రోత్సహించేందుకు మిడ్​ వైఫరీ వ్యవస్థ ఎంతో గొప్పగా పనిచేస్తుందని పేర్కొన్నారు. బీఎస్సీ నర్సింగ్​తర్వాత రెండేండ్ల పీజీ కోర్సు మిడ్​ వైఫరీ శిక్షణను కంప్లీట్ చేసిన 350 మందికి సర్టిఫికెట్లను అందించి మంత్రి అభినందించారు. బల్దియా డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్​ హేమలత, హెల్త్​, ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్ ​ఆర్.వి.కర్ణన్​, డీఎంఈ డా.ఎన్.వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ ​డా.అజయ్​కుమార్​ పాల్గొన్నారు.