
ఆమె ఒక వలస కార్మికుని కూతురు. ఆమె తండ్రి కుటుంబాన్ని పోషించడం కోసం చేయని పనిలేదు. పిల్లల భవిష్యత్తు కోసమే ఆ తండ్రి ఆరాటం. అలాంటి తండ్రి కష్టాన్ని కళ్లారా చూసిన కూతురు పాయల్.. యూనివర్సిటీ టాపర్ గా నిలిచి ఆయన పడిన కష్టానికి విలువ దక్కెలా చేసింది. కేరళలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో బీఏ ఆర్కియాలజీ అండ్ హిస్టరీలో 85 శాతం మార్కులు సాధించి మొదటి ర్యాంకును సాధించింది.
బీహార్‌లోని షేక్‌పురాలోని గోసేమతి గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్.. పాయల్‌కు నాలుగేళ్ల వయసున్నప్పుడు బీహార్ ను వదిలి కేరళకు వలసవచ్చి ఎర్నాకుళంలో స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో పొట్టచేతబట్టుకొని కేరళకు మకాం మార్చిన ప్రమోద్ కుమార్ ఇప్పుడు కొచ్చిలో నివసిస్తున్నాడు. పిల్లల చదువు మరియు వారికి మెరుగైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ఆయన అనేక సంవత్సరాలుగా వివిధ ఉద్యోగాలను చేశాడు.
టాప్ ర్యాంక్ సాధించడం పట్ల పాయల్ తన సంతోషాన్ని వెలిబుచ్చింది. తన తండ్రి పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఆమె చెప్పింది. ‘నా తల్లిదండ్రుల కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. మేం ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా తండ్రి పెయింట్ షాపులో పనిచేస్తున్నాడు. నా తల్లి గృహిణి. నన్ను, చెల్లిని, అన్నయ్యను ఇలా చదివించడం వారికి అంత తేలికైన విషయం కాదు. నా తండ్రి ఆర్థికపరిస్థితులు చూసి ఒకానొక సందర్భంలో చదువు మానేయాలనుకున్నాను. కానీ, మా ఉపాధ్యాయులు బిపిన్ సర్ మరియు వినోద్ సర్ నా నిర్ణయాన్ని తప్పని చెప్పి.. నన్ను మళ్లీ చదువుకునేలా చేశారు’ అని తెలిపింది.
పాయల్ చిన్నతనం నుంచే చదువులో ముందుండేది. పదవ తరగతి బోర్డు పరీక్షలలో 85 శాతం మార్కులు, 12వ తరగతి పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించింది. ఆమె చెల్లెలు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చదువుతుంది. ఆమె అన్నయ్య ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరందరూ తమ తల్లిదండ్రుల కలను కూడా నెరవేర్చారు. పాయల్ సివిల్ సర్వీసులలో చేరాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కానీ.. ఆమె మాత్రం ఇంకా చదివి.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని కోరుకుంటుంది.
For More News..