చైనా ఫైటర్ జెట్.. మావైపు దూసుకొచ్చింది.. అమెరికా మిలిటరీ ప్రకటన

చైనా ఫైటర్ జెట్.. మావైపు దూసుకొచ్చింది.. అమెరికా మిలిటరీ ప్రకటన

బ్యాంకాక్: దక్షిణ చైనా సముద్రం ఎయిర్ స్పేస్ లో చైనా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. అమెరికా ఫైటర్ జెట్ కు అతి సమీపంలోకి చైనా ఫైటర్ జెట్ దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ గురువారం వెల్లడించింది. ‘‘మా యుద్ధ విమానం బీ–52 బాంబర్ రొటీన్ రౌండ్లు కొడుతున్న టైమ్ లో చైనాకు చెందిన షెన్యాంగ్ జె–11 ట్విన్ ఇంజన్ ఫైటర్ జెట్ మావైపు దూసుకొచ్చింది. అధిక వేగంతో దూసుకొచ్చిన చైనా ఫైటర్ జెట్.. మా విమానానికి10 ఫీట్ల దూరంలోకి వచ్చింది. 

కొంచమైతే రెండు విమానాలు ఢీకొనేవి. చైనా తీరు రెండు విమానాలను ప్రమాదంలోకి నెట్టింది. విమానం ఢీకొనేంత దగ్గరగా వచ్చిందని చైనా పైలెట్ కు తెలియకపోవడం ఆందోళనకరం” అని యూఎస్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే రొటీన్ ఆపరేషన్స్ చేశామని పేర్కొంది. 

అయితే ఈ విషయంలో అమెరికానే చైనా నిందించింది. అమెరికా ఫైట్ జెట్ తమ ఎయిర్ స్పేస్ లోకి వచ్చిందని, కావాలనే తమను రెచ్చగొట్టిందని ఆరోపించింది. కాగా, దక్షిణ చైనా సముద్రం ఎయిర్ స్పేస్ తమదేనని చైనా వాదిస్తుండగా.. అది అంతర్జాతీయమని చెప్పేందుకు అమెరికా తరచూ విన్యాసాలు చేపడుతోంది. ఈ క్రమంలో అమెరికా విమానాలను చైనా అడ్డుకుంటోంది. ఇలాంటి ఘటనలు 2021 నుంచి ఇప్పటి వరకు 180 జరిగాయని అమెరికా ఆర్మీ తెలిపింది.