మణిపూర్ సీఎం కాన్వాయ్ పై మిలిటెంట్ల దాడి

మణిపూర్ సీఎం కాన్వాయ్ పై మిలిటెంట్ల దాడి
  • సీఎం భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలు

ఇంఫాల్: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్ పై  మిలిటెంట్లు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం కాంగ్ పోక్పి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జూన్ 6న ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి జిరిబామ్ జిల్లాలో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో శాంతి, భద్రతల పరిస్థితులను పరిశీలించాలని సీఎం బీరేన్ సింగ్ నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు చేయడానికి ఇంఫాల్ నుంచి కాన్వాయ్ ను పంపించారు. అది నేషనల్ హైవే నంబర్–53పైకి చేరుకోగానే కొట్లేన్ గ్రామ సమీపంలో సాయుధులైన దుండగులు దానిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బీరేన్ సింగ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని మణిపూర్ ప్రజలపై జరిగిన దాడిగా అభివర్ణించారు.