మళ్లీ పెరిగిన పాల ధరలు.. రూ.68కి చేరిన హోల్​ మిల్క్

మళ్లీ పెరిగిన పాల ధరలు.. రూ.68కి చేరిన హోల్​ మిల్క్
  • రూ.50 దాటిన టోన్డ్​ పాల ధరలు.. రూ.68కి చేరిన హోల్​ మిల్క్
  • లీటర్​కు రూపాయి పెంచి రూ.48 చేసిన విజయ డెయిరీ
  • ఉత్పత్తి తగ్గడంతోనే పెంచామంటున్న కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాల ధరలు మళ్లీ పెరిగాయి. పాల కొరత నేపథ్యంలో ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.2 నుంచి రూ.6 వరకు ధరలు పెంచేశాయి. దీంతో టోన్డ్‌‌ మిల్క్‌‌ ధరలు లీటరుకు రూ.50 దాటింది. ఆరోఖ్య, దొడ్ల, హెరిటేజ్‌‌, తిరుమల.. ఇలా దాదాపు అన్ని ప్రైవేటు డెయిరీలు పాల ధరలు పెంచాయి. విజయ డెయిరీ కూడా ఒక రూపాయి పెంచడంతో ధర రూ.48కి పెరిగింది. ఒక్క అమూల్‌‌ బ్రాండ్​ పాల ధర మాత్రం లీటర్‌‌ రూ.46గా ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఆ కంపెనీ కూడా ధర పెంచే అవకాశముంది. ఇక వెన్నశాతం అధికంగా ఉండే హోల్‌‌ మిల్క్‌‌ ధరలు కూడా ఆరు రూపాయలు పెరిగి రూ.68 వరకు చేరాయి. నెల రోజుల్లోగానే పాల ధరలు రెండు సార్లు పెరగడం గమనార్హం.

పాల సేకరణ తగ్గింది

వాతావరణ మార్పుల నేపథ్యంలో నాలుగైదేళ్లకోసారి పాల కొరతతో ఇలాంటి సమస్య వస్తుందని డెయిరీ వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది వానలు బాగా పడి, భూగర్భ జలాలు పెరిగాయని, దాంతో రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపడంతో పాల ఉత్పత్తి తగ్గిందని తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 శాతం వరకు పాల సేకరణ తగ్గిందని, దాంతో ధరలు పెంచామని పేర్కొన్నాయి. ప్రైవేటు డెయిరీల రాకతో పోటీ పెరిగిందని, ఎవరు ఎక్కువ ధర ఇస్తే రైతులు వారికే పాలు పోస్తున్నారని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఎక్కువ ధర చెల్లించి పాలు సేకరిస్తున్నామని, దాంతో పాల ధరలు పెంచాల్సి వచ్చిందని చెప్పారు. విజయ డెయిరీ ఫిబ్రవరి ఒకటి నుంచి పాల సేకరణ ధరను లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది.

వాడకం పెరిగింది

రాష్ట్రంలో పాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో డిమాండ్​ కూడా పెరిగింది. సహకార సంఘాల ద్వారా నడిచే విజయ, ముల్కనూర్‌‌, కరీంనగర్‌‌, మదర్‌‌ డెయిరీలకు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోని రెండు లక్షల మంది రైతులు పాలు సరఫరా చేస్తున్నారు. వీటితోపాటు 60కి పైగా డెయిరీలు పాలు అమ్ముతున్నాయి. మరో 22 లక్షల మంది రైతులు ఒకట్రెండు ఆవులు, గేదెలతో పాడి నిర్వహిస్తున్నారు. సహకార డెయిరీల ద్వారా రోజుకు ఏడు లక్షల లీటర్ల పాలను మార్కెట్‌‌లో విక్రయిస్తుండగా.. అందులో ఒక్క విజయ డెయిరీ నుంచే రెండున్నర లక్షల లీటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ప్రైవేటు డెయిరీలు, లూజు పాలతో కలిపి మొత్తంగా 36 లక్షల లీటర్ల పాల వినియోగం జరుగుతోంది.

పాల సేకరణ పెంచాలి: మంత్రి తలసాని

విజయ డెయిరీకి పాల సేకరణను మరింతగా పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్​లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న తన కార్యాలయంలో డెయిరీ అధికారులతో సమావేశమయ్యారు. డెయిరీ పరిస్థితిపై సమీక్షించారు. జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి పాల సేకరణను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలన్నారు. విజయ డెయిరీ ప్రొడక్టులకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. వేసవి సమీపిస్తున్నందున ప్రతి విక్రయ కేంద్రంలో ఐస్ క్రీం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.