ఆత్మహత్యాయత్నం.. ఫోన్ ట్రేస్ చేసి కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నం.. ఫోన్ ట్రేస్ చేసి కాపాడిన పోలీసులు
  • సకాలంలో స్పందించి ఆస్పత్రిలో చేర్చిన కీసర పోలీసులు

మేడ్చల్ జిల్లా: వ్యాపారంలో నష్టాలు రావడంతో డబ్బు కష్టాలు భరించలేకపోయిన ఓ యువకుడు ఊరి బయట గుట్టలోకి వెళ్లి కూల్ డ్రింక్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం ఇంట్లో నుంచి బాధతో వెళ్లిపోయిన కొడుకు మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కీసర పోలీసులు వెంటనే స్పందించి ఫోన్ నెంబర్ ట్రేస్ చేయగా.. ఊరి బయట గుట్టలో ఉన్నట్ల చూపించింది. వెంటనే అక్కడకు వెళ్లి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో నిండు ప్రాణం దక్కింది. వివరాలిలా ఉన్నాయి.
కీసర పోలీస్ స్టేషన్ పరిధి కీసర దాయరాకు చెందిన నక్క ప్రవీణ్ వృతి రీత్యా పాల వ్యాపారం. వ్యాపారం సరిగా జరగక నష్టాలు రావడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. ఆర్ధిక కష్టాలు భరించలేక నిన్న మంగళవారం తల్లితో గొడవ పడి చనిపోతాను అని చెప్పి ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయాడు నక్క ప్రవీణ్. మధ్యాహ్నం భోజనం సమయం దాటినా  ఇంటికి రాకపోవడంతో తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్ అన్న నవీన్ కూడా తల్లి వెంట స్టేషన్ కు వెళ్లాడు. పోలీసులు వెంటనే నక్క ప్రవీణ్ మొబైల్ ఫోన్ నెంబర్ కోసం  ట్రేస్ చేస్తే.. యాదాద్రి జిల్లా బొమ్మలరామరం మండలం పరిధిలోని పర్వతపురం గుట్టలో ఉన్నట్లు చూపించింది. కీడును శంకించిన పోలీసులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి వెంటనే హడావుడిగా గుట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒక బండ రాయిపై కూల్ డ్రింక్ సీసా.. పక్కన పురుగుల మందు డబ్బా ఉంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రవీణ్ వీటిని కలుపుకొని తాగి పడిపోయినట్టు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో నక్క ప్రవీణ్ ని హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు. ప్రవీణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం.