మిల్లర్ల దోపిడీ రూ.500 కోట్లకు పైనే!

మిల్లర్ల దోపిడీ రూ.500 కోట్లకు పైనే!
  • తప్ప, తాలు పేరిట క్వింటాల్‌కు 3 నుంచి 4 కిలోల కటింగ్
  • లారీ వెళ్లగానే మిల్లుల నుంచి రైతులకు ఫోన్లు
  • ఒప్పుకుంటే అన్లోడ్.. లేదంటే రిటర్న్
  • పట్టించుకోని ఉన్నతాధికారులు.. లబోదిబోమంటున్న అన్నదాతలు

ఆదిలాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో రైస్​ మిల్లర్లు భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. తప్ప, తాలు పేరిట ప్రతి క్వింటాల్​కు 3 నుంచి 4 కిలోలు..  కొన్నిచోట్ల 6 కిలోల దాకా కోత పెడుతున్నారు. సెంటర్లలో ఐకేపీ, ఫ్యాక్స్​ సిబ్బంది ప్రతి 40 కిలోల బ్యాగ్​కు కిలోన్నర దాక కటింగ్​ చేస్తుండగా, మిల్లులకు పోయాక మళ్లీ క్వింటాల్​కు 2 కిలోల దాకా కోత పెడుతున్నారు. ఇందుకు ఒప్పుకున్న రైతులవే అన్​లోడ్​ చేసుకుంటూ, ఒప్పుకోని రైతుల బస్తాలు మళ్లీ సెంటర్​కు తిప్పి పంపుతున్నారు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో రైతులు తలపట్టుకుంటున్నారు.

వందల కోట్ల దోపిడీ 
ఈ యాసంగిలో 1.32 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌‌సీఐ  80.88 లక్షల టన్నులను తీసుకునేందుకు అంగీకరించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌‌‌‌, జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6 వేలకు పైగా సెంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యాన్నే సేకరించి, మిల్లింగ్​ కోసం ఎప్పటికప్పుడు రైస్​మిల్లులకు తరలిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్​రకానికి రూ. 1,868, బి గ్రేడ్​కు రూ. 1,800 మద్దతు ధర చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  మిల్లర్లు తప్ప, తాలు పేరిట ప్రతి క్వింటాల్​కు కనిష్ఠంగా 3 నుంచి కొన్నిచోట్ల 6 కిలోల దాకా కటింగ్​ పెడుతున్నారు. తక్కువలో తక్కువ క్వింటాల్​కు 3 కిలోలు వేసుకున్నా ఒక్కో క్వింటాల్​పై రైతులు రూ.54 లాస్​ అవుతున్నారు. ఈ లెక్కన 8 కోట్ల క్వింటాళ్ల ధాన్యానికి రూ.  432 కోట్ల మేర నష్టపోతున్నారు. క్వింటాల్​కు మూడు కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంటే రఫ్​గా నాలుగు కిలోలు వేసుకుంటే ఈ మొత్తం రూ.500 కోట్లు దాటుతుందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.

మిల్లర్లతో అధికారులు కుమ్మక్కు 
రాష్ట్రవ్యాప్తంగా 2,200 రైసు మిల్లులు ఉండగా అందులో దాదాపు 1,500 రైసు మిల్లుల్లో ప్రభుత్వం కస్టమ్​మిల్లింగ్ చేయిస్తోంది. సెంటర్ల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా ఈ రైస్​మిల్లులకు.. అక్కడి నుంచి ఎఫ్​సీఐకి పంపిస్తోంది. కొంతకాలం నుంచి  కస్టమ్​ మిల్లింగ్ చేస్తున్న రైస్ మిల్లుల యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కై రూల్స్​ను పట్టించుకోవడం లేదు. రూల్స్​ ప్రకారం కొనుగోలుసెంటర్​లో వడ్లు అమ్మిన తర్వాత రైతు పాత్ర పూర్తి కావాలి. కొనుగోలు కేంద్రాల్లోనే నిర్వాహకులు క్వాలిటీని పరిశీలించాకే  ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తేమ ఉంటే ఆరబోశాకే తీసుకుంటున్నారు. తప్ప, తాలు ఉంటే అక్కడే తూర్పార పట్టిస్తున్నారు. అప్పటికీ 40 కేజీల బస్తాపై కిలోన్నర వరకు కటింగ్​ పెడుతున్నారు. తీరా సెంటర్ల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం చేరిన తర్వాత కూడా మళ్లీ రైతును బలిపశువు చేస్తున్నారు. రైసు మిల్లుల్లోని సిబ్బంది నేరుగా రైతులకే ఫోన్ చేసి కటింగ్​కు ఒప్పుకోకపోతే వడ్లను వెనక్కి పంపుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది రైతులు ఎక్కడ రిటర్న్​ పంపుతారోననే భయంతో కటింగులకు అంగీకరిస్తున్నారు. కాగా, ఇదంతా ఆఫీసర్లకు  బహిరంగంగా తెలిసినప్పటికీ వారు స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది.  మిల్లర్ల దోపిడీ చాలదన్నట్లు కొన్ని సెంటర్లలోని సిబ్బంది కూడా దండి కొడుతూ రైతులను మోసగిస్తున్నారు. నిర్మల్​ జిల్లా పార్​పెల్లి ధాన్యంకొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల క్రితం తూకంపేరుతో మోసం చేస్తున్నారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి రైతులు, స్టాఫ్​ను విచారించారు. ఈ రిపోర్ట్​ను కలెక్టర్​కు అందజేశారు.

కటింగ్​కు ఒప్పుకోలేదని లారీలు వెనక్కి.. 
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్​పల్లిలో ప్యాక్స్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్​ ఏర్పాటు చేశారు. తప్ప, తాలు పేరిట ప్రతి 40 కిలోల బస్తాకు 41.5 కిలోలు తూకం వేసి మరీ రైస్​మిల్​కు తరలి స్తున్నారు. అంటే ప్రతి క్వింటాల్​పై 4 కిలోలకు పైగా కాంటా పెడుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 22న మిల్లర్ల నుంచి రైతులకు ఫోన్​ వచ్చింది. ఒక్కో బస్తాకు అదనంగా మరో రెండు కిలోలు కటింగ్ చేస్తామని, ఒప్పుకుంటేనే దింపుకొంటామని, లేదంటే వెనక్కి పంపు తామని మిల్లర్లు బెదిరించారు. ఇప్పటికే తప్ప, తాలు పేరుతో క్వింటాల్​కు 4 కిలోలకు పైగా  కట్​చేశారని, మళ్లీ 2 కిలోలకు ఒప్పు కునే ప్రసక్తి లేదని రైతులు చెప్పడంతో రైస్ మిల్లుల నుంచి 2,400 వడ్ల బస్తాలు ఫ్యాక్స్ సెంటర్ కు తిప్పి పంపించారు.  ఏం చేయా లో తెలియని 20 మంది రైతులు కటింగ్​కు ఒప్పుకోవడం తో 1,568 బస్తాలను మళ్లీ రైస్ మిల్లులకు తీసుకెళ్లగా మిగిలిన రైతులకు చెందిన 832 బస్తాలు ఫ్యాక్స్ సెంటర్ లోనే ఉండిపోయాయి.  దీంతో ఆదివారం రైతులు నారాయణ, నరేశ్​ రెడ్డి, సుధాకర్ రెడ్డి అక్కడే  నిరసనకు దిగారు. కటింగ్ ల పేరుతో సాగు తున్న మోసాలపై ఉన్నతాధికారులు స్పందిం చి, చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు