82 % సీఎంఆర్​ మిల్లర్ల వద్దే..పెండింగ్ ఈ నెలాఖరు వరకే గడువు

82 %  సీఎంఆర్​ మిల్లర్ల వద్దే..పెండింగ్ ఈ నెలాఖరు వరకే గడువు
  •     టైమ్​కు ఇవ్వక సివిల్​ సప్లయ్స్​పై వడ్డీల భారం
  •     ఇప్పటికే రూ.56 వేల కోట్లు బాకీ
  •     సర్కారు సొమ్ముతో మిల్లర్ల వ్యాపారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మిల్లర్లు కస్టమ్​మిల్లింగ్​రైస్​(సీఎంఆర్) విషయంలో ప్రతీ ఏటా తీవ్ర జాప్యం చేస్తున్నారు. గత వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ ఈ నెలాఖరు వరకే ఇవ్వాల్సి ఉండగా.. ఇంకా 81.68 శాతం పెండింగ్​లోనే ఉంది. సర్కారు వేలకోట్లు వెచ్చించి వడ్లు కొనుగోలు చేసి ఇస్తే.. మిల్లర్లు నెలలు తరబడి పెండింగ్​పెడుతూ ఇచ్చినప్పుడే తీసుకోవాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. 

.దీంతో సివిల్​సప్లయ్స్​సంస్థపై వడ్డీల భారం  పడుతోంది. ఇప్పటికే రూ.56వేల కోట్లు బాకీ పడింది. నికరంగా రూ.11,500 కోట్లు అప్పుల్లో కూరుకుపోయింది. మిల్లర్లు మాత్రం మిల్లింగ్​జాప్యంపై అనేక కారణాలు చెప్తూ గడువును  వాయిదా వేయించుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా ఇదే తంతు కొనసాగిస్తున్నారు. కొత్త సర్కారు వచ్చిన నాటి నుంచి పెండింగ్ సీఎంఆర్ ను రాబట్టడానికి కఠినంగా వ్యవహరిస్తున్నా.. గడువులోగా పూర్తయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. 

క్వింటాల్​ బియ్యం కూడా ఇవ్వని కొందరు మిల్లర్లు​

గత వానాకాలం సీజన్‌‌ లో 47.34 లక్షల టన్నుల వడ్లను సివిల్​సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​సేకరించి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు క్వింటాల్‌‌ వడ్లు మిల్లింగ్‌‌ చేసి 67 కిలోల బియ్యం సీఎంఆర్​ రూపంలో ఎఫ్‌‌సీఐకి అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 31.76 లక్షల టన్నుల సీఎంఆర్​ను ఎఫ్​సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు కేవలం 5.82 లక్షల టన్నులు(18.32%) మాత్రమే మిల్లర్లు అందించారు. ఇంకా 25.94 లక్షల టన్నులు(81.68%)  పెండింగ్​లోనే ఉంది. కొందరు మిల్లర్లు కనీసం క్వింటాల్​ బియ్యం కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ సేకరణ జరిగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లో ఒక్క బియ్యం గింజ కూడా ఇవ్వలేదు. జగిత్యాల, నిర్మల్,  కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కనీసం 20 శాతం కూడా పూర్తి చేయలేదు. 

నిరుడు యాసంగి సీఆర్​ఎం ఇంకా కొంత పెండింగ్​

నిరుడు యాసంగిలో సర్కారు 66.84 లక్షల టన్నుల వడ్లు సేకరించి.. 35 లక్షల టన్నులు టెండర్ల ద్వారా అమ్మకానికి పెట్టింది. మిగిలిన వడ్లు మిల్లింగ్​చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 19.19 లక్షల టన్నులు సీఎంఆర్​ రూపంలో మిల్లర్లు అందించారు. ఇందులో బాయిల్డ్​ రైస్​ 14.81లక్షల టన్నులు ఇవ్వగా.. రా రైస్​ మాత్రం కేవలం 4.01 లక్షల టన్నులే ఇచ్చారు. ఇంకా పెండింగ్​లో ఉన్న సీఎంఆర్​లో 25.90 లక్షల టన్నుల్లో 23.62 లక్షల సీఎంఆర్​కు సంబంధించిన వడ్లు సర్కారు టెండర్లలో అమ్ముకుంది. దీంతో నిరుడు యాసంగికి సంబంధించి ఇంకా 2.28 లక్షల టన్నులుపెండింగ్​లో ఉంది. అయితే, అవి మిల్లర్ల వద్ద ఉన్నాయా? అమ్ముకున్నారా? అనేది తేలాల్సి ఉంది.

సర్కారు వడ్లతో మిల్లర్ల బిజినెస్​

రాష్ట్రంలో ఉన్న మిల్లర్లలో చాలా వరకు వడ్లు మిల్లింగ్​చేసి సర్కారుకు టైమ్​కు ఇవ్వకుండా గోల్​మాల్​చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్కారు నుంచి రూ.97,511.76 కోట్ల విలువైన వడ్లు తీసుకొని.. గడువులోగా మిల్లింగ్​చేసి ఇవ్వకుండా అక్రమంగా బయటి మార్కెట్​లో అమ్ముకుంటూ సర్కారు సొమ్ముతో బిజినెస్​ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కొందరు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటుంటే.. మరికొందరు ఏకంగా విదేశాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. ఓపెన్​ మార్కెట్​లో ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకుని.. తక్కువ ధరకు వచ్చిన బియ్యం ఎఫ్​సీఐకి అప్పగిస్తున్నారని సమాచారం. దీంతో ఆ బియ్యం పురుగు పడుతున్నట్టు తెలిసింది. దీనిపై ఇటీవల ఎఫ్​సీఐ చెన్నై రీజనల్​ కేంద్రానికి పలు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో ఆరుగురు మేనేజర్లు, 16 మంది టెక్నికల్​అసిస్టెంట్​లను ఈ సీజన్​అయ్యే వరకు ప్రొక్యూర్​మెంట్​విధుల్లోంచి తొలగించారు.