నేరేడుచర్ల, వెలుగు: పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం ఆయన నేరేడుచర్ల పీఎస్‌ను తనిఖీ చేసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..హుజూర్ నగర్ నియోజకవర్గంలో సేఫ్ హుజూర్ నగర్ సర్కిల్ ప్రాజెక్టులో భాగంగా 150 నుంచి 200 సీసీ కెమెరాలను, నేరేడుచర్ల లో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాను సులువుగా గుర్తించవచ్చన్నారు.
తనిఖీలో భాగంగా పీఎస్పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఎస్ఐ రవీందర్ ఇటీవల ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడి చనిపోయిన బాలిక మృతదేహాన్ని వెలికితీయడంలో కృషిచేసినందుకు అభినందించారు. ఎస్పీ వెంట డీఎస్పీలు శ్రీధర్ రెడ్డి, రవి, సీఐలు రామారావు, చరమందరాజు, ఎస్ఐ రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
