ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావద్దు  : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండలోని కలెక్టరేట్​లో ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీతో ఆమె మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో సంభవించిన ర్యాగింగ్ సంఘటనలపై చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. అంతకుముందు కలెక్టరేట్​లో కలెక్టర్​ 7 వ చిన్న తరహా సాగునీటి వనరుల గణన, 2 వ జలాశయాల గణన పై ముఖ్య ప్రణాళిక అధికారి, సంబంధిత అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి భద్రతను మెరుగుపరిచి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సహకరించే 7 వ చిన్న తరహా నీటి వనరుల గణన, 2 వ జలాశయాల గణన కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని  కోరారు.అంతకుముందు బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్​ కాలేజ్​లో నిర్వహించిన జవహార్​లాల్​ నెహ్రూ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలనపై దిశానిర్దేశం చేశారు.  

ఆ తర్వాత నల్లగొండ మండలంలోని దోమలపల్లికి చెందిన తిప్పర్తి తహసీల్దార్​ కార్యాలయంలో పని చేసే దేశగాని నర్సింహ మృతి చెందడంతో కలెక్టర్​ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున రావాల్సిన బెనిఫిట్స్​ను త్వరగా వచ్చేలా చూస్తామని, కుటుంబంలో అర్హత ఉన్నవారికి ఉద్యోగావకాశం  కల్పిస్తామని తెలిపారు.