యాదగిరి గుట్ట/తుంగతుర్తి/హాలియా, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలే వస్తాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా.. శుక్రవారం యాదగిరిగుట్టలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సర్కిల్ లో పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేకపోయారని విమర్శించారు. ఈ విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇకనైనా కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసిన, బీఆర్ఎస్, బీజేపీలకు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారని పేర్కొన్నారు. హాలియా మున్సిపాలిటీ లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌని రాజారమేశ్ యాదవ్, హాలియా టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నవీన్ యాదవ్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే జూబ్లీహిల్స్ ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సర్కారు కృషి చేస్తుందని తెలిపారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
