- నేత్రపర్వంగా పంచామృత నిజాభిషేకం, శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్‌లోని వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ పుష్కర వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రాతఃకాల పూజ, స్థాపిత దేవతా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తికి పంచామృత నిజాభిషేకం, శతఘటాభిషేకం నిర్వహించారు. తర్వాత రుద్రహోమం, చండీ సప్తశతి హవనం, మహాబలి నివేదన చేపట్టారు. మధ్యాహ్నం ప్రత్యేక పూజల అనంతరం మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం నిర్వహించి ధ్వజావరోహణ గావించారు. దీంతో వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయ పుష్కర వార్షికోత్సవాలు ముగిశాయని ఆలయ అర్చకులు తెలిపారు.
పాల్గొన్న విప్ అయిలయ్య దంపతులు
లోటస్ టెంపుల్ లో నిర్వహించిన చండీ సప్తశతి హవనం(చండీ హోమం), మహా పూర్ణాహుతి పూజల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య–అనిత దంపతులు పాల్గొన్నారు. అనంతరం వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డూప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు.
కార్యక్రమంలో వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం అధ్యక్షుడు బెజుగం వెంకట నర్సయ్య, ఉపాధ్యక్షుడు బెజుగం శివకుమార్, వర్తక సంఘం అధ్యక్షుడు మాధవులు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేశ్‌యాదవ్ తదితరులు ఉన్నారు.
