- బ్యాంక్ గ్యారంటీకి, ఔటర్న్కు మెలిక పెట్టిన మిల్లర్లు
- 67 కిలోల బియ్యం సాధ్యం కాదని వెల్లడి
- కండిషన్లకు ఒప్పుకుంటేనే చర్చలకు రావాలంటున్న ఆఫీసర్లు
- తేలని సన్నవడ్ల మిల్లింగ్ఔటర్న్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముందుగా సాగు చేసిన ప్రాంతాల్లో వరి కోతలు షురూ కావడంతో ఇప్పుడిప్పుడే సెంటర్లకు వడ్లు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సెంటర్లు తెరుస్తూ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సివిల్ సప్లయ్స్ వేగం పెంచుతోంది.
ఒకవైపు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్వడ్లు కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేస్తుండగా మిల్లర్లు సన్న వడ్లు మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వడానికి, బ్యాంక్ గ్యారెంటీకి మెలిక పెడుతూ స్పష్టత ఇవ్వాలని సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు.
గ్యారెంటీ ఇవ్వాలంటే క్వింటాల్ కు 58 కిలోలకు ఒప్పుకోవాలనే మిల్లర్లు ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. సన్న ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసివ్వడం తమకు భారమని మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఇటీవల కేబినెట్ సబ్‌కమిటీ మీటింగ్‌లో తేల్చి చెప్పారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) నిబంధనల మేరకు క్వింటాల్ వడ్లను మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో యాసంగి వడ్లు రారైస్‌గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి, నూకలు వస్తాయని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఇప్పుడు వానాకాలం వడ్లకు సైతం వంకలు పెట్టడానికి సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో పండే సన్నరకాల వడ్లు మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం రావని, టెస్ట్ మిల్లింగ్ చేసి ఔటర్న్ ను 58 కిలోలకు తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎఫ్‌సీఐ నిబంధనలు మార్పించి లబ్ధి పొందాలని మిల్లర్లు భావిస్తున్నారు.
సన్నవడ్లు మిల్లింగ్ చేస్తే సర్కారు చెప్తున్నట్టు 67 శాతం బియ్యం రాదని.. 58 శాతం బియ్యం, 9 శాతం నూకలు ఇస్తామని చెప్పారు. అలాగే వరి ధాన్యంలో తేమ 17 శాతం కాకుండా 14 శాతానికి మార్చాలని అడుగుతున్నారు.
32 రకాల ధాన్యాన్ని సన్నరకాలుగా గుర్తించాలని, మిల్లింగ్ చార్జీలు, ధాన్యం నిల్వచేసిన చార్జీలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ తేల్చకపోవడంతో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బ్యాంక్ గ్యారంటీ
గతంలో సీఎంఆర్ కోసం కేటాయించిన వడ్లతో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వడ్లను పక్కదారి పట్టించి, ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొట్టారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఆస్తుల జప్తు వంటి చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.
దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే, రూల్స్ మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే బ్యాంక్ గ్యారంటీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ సీజన్ లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ మార్గదర్శకాలు రూపొందించింది.
దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, డ్రాఫ్ట్ పూర్తయినా దాన్ని ఆపేసి, మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం లీజుదారుడు చెల్లించాలి. అయితే, ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు.
బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తమకు భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ప్రభుత్వంపై మిల్లర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని ఫైన్‌తో సహా అప్పగించడంతోపాటు 25 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్లు సివిల్ సప్లయ్స్ లెక్క తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించబోమని కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తేల్చిచెప్పారు.
టైమ్‌ను బట్టి సర్కారుపై మిల్లర్ల ఒత్తిడి
రాష్ట్రంలో ఈయేడు రికార్డు స్థాయిలో 66.73 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఇందులో ఎక్కువగా సన్నరకాలే సాగు చేయడంతో సన్నవడ్లు భారీ ఎత్తున మార్కెట్‌కు రానుంది. ప్రభుత్వమే క్వింటాల్‌పై రూ.500 బోనస్ గా ఇస్తుండడంతో సన్నధాన్యం 80 శాతం వరకు సివిల్ సప్లయ్స్ ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లకే వచ్చే అవకాశం ఉంది.
దీంతో మిల్లర్లు నేరుగా రైతుల నుంచి అడ్డగోలు ధరలకు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయింది. సర్కారు సేకరించిన సన్నవడ్లను వెంటనే మిల్లింగ్ చేసి, జనవరిలోగా ప్రభుత్వానికి అప్పగిస్తే అప్పటి నుంచి రేషన్ లబ్ధిదారులకు సర్కారు సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. మిల్లర్లు టైమ్‌కు మిల్లింగ్ చేసి అందిస్తేనే సన్నబియ్యం సరఫరాకు ఇబ్బంది ఉండదు.
ఈ నేపథ్యంలో ఇదే అదునుగా తాము వీలైనంత తక్కువకు బియ్యం ఇచ్చినా.. అందుకు ఒప్పుకునేందుకు సర్కారుపై మిల్లర్లు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.