- గుప్త నిధుల తవ్వకాలకు అడవికి వెళ్లిన వైనం
- 8 మందిని అరెస్ట్ చేసిన అటవీ అధికారులు
కాగ జ్ నగర్, వెలుగు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఫారెస్ట్ రేంజ్ లోని లక్ష్మిపూర్ అడవిలోని గుట్టపై గుప్తనిధుల కోసం తవ్విన 8 మంది అరెస్ట్ అయ్యారు. సిర్పూర్ (టి) ఇన్ చార్జ్ ఎఫ్ఆర్వో ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన నన్న రాజేశ్ ఓ కేసులో జైలుకు వెళ్లగా.. అక్కడ కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన రామ్టెంకి రాహుల్ పరిచయమయ్యాడు. అడవిలో గుప్త నిధులు ఉన్నాయని రాజేశ్ చెప్పాడు.
అనంతరం వీరు జైలు నుంచి విడుదలై వెళ్లిపోయారు. లక్ష్మిపూర్ శివారు అడవిలో రాజేశ్ ఒక చోట తవ్వి అక్కడ రాళ్లకు పెయింట్ వేశాడు. వాటిని ఫొటోలు, వీడియోలు తీసి రాహుల్ కు పంపాడు. గుప్తనిధులున్నాయని నమ్మని అతడు ఈనెల 20న గుండాయిపేటకు చెందిన పాల్ రవి, దుర్గం మారుతి, గొంగ్లే కిశోర్, చల్లూర్కార్ సాజన్, రామ్టెంకి సునీల్, కనికి గ్రామానికి చెందిన దుర్గం రాజారాంతో కలిసి వెళ్లాడు. గుప్త నిధుల తవ్వాకాల కోసం అడవిలోకి వెళ్లగా ఫారెస్ట్ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. విచారించగా అసలు విషయాలు తెలిపారు.
8 మందిపై కేసు నమోదు చేసి శనివారం రాత్రి సిర్పూర్ (టి) కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 13 రోజులు రిమాండ్ విధించారు. నిందితులను ఆదివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు తరలించామని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. కేసు విచారణలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శశిధర్ బాబు, బీట్ ఆఫీసర్లు హబీబా, రవీనా, నరేశ్, అరుణ్ రెడ్డి, అరవింద్ పాల్గొన్నారు. గుప్త నిధుల కోసం అత్యాశకు పోయి అడవిలోని సహజ వనరులను ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని, ప్రజలు వన్యప్రాణుల రక్షణకు సహకరించాలని కాగజ్ నగర్ ఎఫ్ డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే సూచించారు.
