సెగ్మెంట్ సీన్.. అసద్​ను ఢీ కొట్టేదెవరు?

సెగ్మెంట్ సీన్.. అసద్​ను ఢీ కొట్టేదెవరు?
  •    1984 నుంచి భాగ్యనగరంలో  ఆ పార్టీదే గెలుపు
  •     బీజేపీ అభ్యర్థిని మారుస్తున్నా గెలవట్లే..  
  •     ఈసారి మాధవీలతకు టికెట్ ఇచ్చిన కమలం పార్టీ 
  •     మూడో స్థానానికి పరిమితమవుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్​లు

హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం ఎంఐ ఎంకు కంచుకోటగా నిలుస్తోంది. 1984 నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థే గెలుపొందుతున్నాడు. 1999 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరు సార్లు విజయం సాధించగా, ఆయన తదనంతరం.. 2004 నుంచి ఇప్పటి వరకు ఆయన కొడుకు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.

దీంతో అసద్​ను ఢీకొట్టేవారు లేకుండాపోయారు. అప్పట్లో తెలుగుదేశం రెండో స్థానంతో సరిపెట్టుకోగా, ఆ పార్టీ కనుమరుగైన తర్వాత బీజేపీ ఆ ప్లేస్​ను భర్తీ చేస్తోంది. 1991లో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాల్ రెడ్డి 39 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ కావడంతో ఇతరులకు గెలిచే అవకాశం లేకుండా పోతోంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ నుంచి భగవంత్ రావు పోటీ చేయగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సుమారు రెండు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.  

7 నియోజకవర్గాల్లో ఆరుచోట్ల ఎంఐఎందే హవా..

ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఒక్క గోషామహల్ మినహా మిగతా ఆరు సెగ్మెంట్లలో ఎంఐఎం ఎమ్మెల్యేలే ఉన్నారు. మూడునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గెలుపును సొంతం చేసుకుంది. కార్వాన్​, చార్మినార్, యాకుత్​పురా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది.

ఏడు నియోజకవర్గాల్లో ఓట్లు చూస్తే ఎంఐఎంకు 4,23,676, బీజేపీకి 2,21,954, బీఆర్ఎస్​కు 1,68,367, కాంగ్రెస్ 1,01,014 ఓట్లు వచ్చాయి. మరో 50 వేల వరకు ఓట్లను ఎంబీటీ దక్కించుకుంది. అయితే, ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంఐఎం తర్వాత ఎవరికైనా విజయావకాశాలు ఉన్నాయా అంటే అది బీజేపీ అనే చెప్పుకోవచ్చు. దీంతో ఈసారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. 

బీజేపీ నుంచి బరిలో మాధవీలత 

బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోతుండడంతో ఈ సారి ఆ పార్టీ ధార్మికవేత్త, విరించి హాస్పిటల్ చైర్‌పర్సన్ మాధవీలతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె కొన్ని సంవత్సరాలుగా పాతబస్తీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  హిందూ ధర్మం కోసం పని చేస్తున్నారు. అంతేగాకుండా సంఘ్ పరివార్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాతబస్తీలో ముఖ్యంగా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఓల్డ్ సిటీతో  సత్సంబంధాలు ఉన్న మహిళా అభ్యర్థి కావడంతో అసదుద్దీన్​కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. లోపా ముద్ర ఫౌండేష‌న్, ల‌తా మా ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అది కలిసి వస్తుందని భావిస్తున్నారు. 

అభ్యర్థి మార్పు ఫలిస్తుందా?

అభ్యర్థిని మార్చడం బీజేపీకి కలిసి వస్తుందా లేదా  అన్న చర్చజరుగుతోంది. ఈ స్థానానికి 2014, 2019లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ 55.16 శాతంతో 5,13,868 ఓట్లు సాధించి గెలవగా, బీజేపీ అభ్యర్థి 33.56 శాతం ఓట్లతో 3,11,414 ఓట్లు పొంది రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి దిగజారింది. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 2014 కంటే ఓటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకున్నారు. బీజేపీ తమ అభ్యర్థిని మార్చకుండా  భగవంతరావును బరిలోకి దించినప్పటికీ ఓటింగ్ శాతం పడిపోయింది. ఆయన కేవలం 26.8 శాతంతో 2,35,285 ఓట్లు మాత్రమే పొందగలిగారు. దీంతో ఈ సారి  హైదరాబాద్ నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకనే ఓల్డ్ సిటీలో పట్టున్న మహిళకి టికెట్ కేటాయించి ఎంఐఎంకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోందనే చర్చ జరుగుతోంది.

మిగతా పార్టీల పరిస్థితి అంతంతే...  

ఎంఐఎంతో ఉన్న సత్సంబంధాలతో బీఆర్ఎస్ ప్రతి ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి దిగేది. దీంతో ఆ పార్టీ గతంలో పాతబస్తీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలతో మాత్రమే గులాబీ పార్టీకి ఓట్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గోషామహల్ లోనే ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారకుండా గెలుపు కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి. ఎంబీటీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్‌పురా నియోజకవర్గంలో గెలిచినంత పని చేసింది.

కేవలం 873 ఓట్ల తేడా ఓటమిపాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముస్లిం మైనార్టీల ఓట్లను ఒకవైపు హస్తం పార్టీ , మరోవైపు ఎంబీటీ చీలిస్తే ఎంఐఎంకు ఓట్లు తగ్గి బీజేపీకి లాభం చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి తమ పార్టీకి ఓట్లు పెరిగే అవకాశముందని కాంగ్రెస్​ లీడర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పాతబస్తీకి మెట్రో రైల్ తదితర ప్రభుత్వ పథకాలతో కూడా ఓట్లు కొల్లగొడతామంటున్నారు.