
హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల నిర్ములనే లక్ష్యంగా హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని పాతబస్తీలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. గురువారం ( మే 8 ) చాంద్రాయణగుట్ట నియోజకవర్గం అక్బర్ నగర్ లో 2వేల గజాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగించింది హైడ్రా. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నారు ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, ముస్లిం మహిళలు.
హైడ్రాకు వ్యతిరేకంగా, కమిషనర్ రంగనాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఎంఐఎం పార్టీ నేతలు, ముస్లిం మహిళలు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ఆక్రమణలు సహించేది లేదని.. ఆక్రమణలకు పాల్పడింది ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.
హైడ్రా ప్రజావాణి ద్వారా ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న హైడ్రా ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపడుతోన్న సంగతి తెలిసిందే... ఇటీవల గచ్చిబౌలిలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.. మంగళవారం ( మే 6 ) గచ్చిబౌలిలోని అక్రమకట్టడాలను తొలగించింది హైడ్రా. స్థానిక సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ లే ఔట్ లో అక్రమ కట్టడాలను గుర్తించిన హైడ్రా.. లే అవుట్ లో రోడ్స్, పార్క్ లో ఆక్రమణలను తొలగించింది. అనుమతులు లేని కట్టడాలను కూల్చేసినట్లు తెలిపారు అధికారులు.
లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగింది హైడ్రా. ఈ క్రమంలో సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు , కిచెన్, రెస్ట్ రూమ్ లను కూల్చేశారు హైడ్రా అధికారులు. లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ తొలగించారు అధికారులు.