4 గ్రాముల గోల్డ్ తో మినీ చంద్రయాన్- 3 మోడల్ డిజైన్

4 గ్రాముల గోల్డ్ తో  మినీ చంద్రయాన్- 3  మోడల్ డిజైన్

మరి కొన్ని గంటల్లో చంద్రయాన్ 3 ఆగస్టు 23న  చంద్రుడిపై అడుగు పెట్టనుంది.  ఇలాంటి అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు. వారి కష్టానికి ప్రతిఫలం మరి కొన్ని గంటల్లో  ప్రపంచానికి కనిపించనుంది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలకు  కృతజ్ఞతలు చెప్పాలనుకున్న ఓ వ్యక్తి విన్నూతంగా ఆలోచించాడు. ఏకంగా మినీ చంద్రయాన్ 3ని రూపొందించాడు. అది కూడా గోల్డ్ తో.. 

 కోయం బత్తూరుకు చెందిన ఓ  ఆర్టిస్ట్ 4 గ్రాముల గోల్డ్ ను ఉపయోగించి 1.5 అంగుళాల పొడవున్న చంద్రయాన్-3 మోడల్‌ను రూపొందించారు. చంద్రయాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ  చిన్న చిత్రాన్ని తయారు చేసినట్లు మారియప్పన్ అనే  కళాకారుడు తెలిపారు.

ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం

తాను  ప్రతిసారీ ఒక ముఖ్యమైన సంఘటన జరిగినప్పుడు బంగారంతో  చిన్న మోడల్ ను  తయారు చేస్తానని మారియప్పన్ చెప్పారు.  చంద్రయాన్-3 యొక్క లూనార్ ల్యాండర్ విక్రమ్  ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సిద్ధంగా ఉందని..  ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.  ఈ క్రమంలో తన భావాన్ని వ్యక్తపరచటానికి  చంద్రయాన్ ప్రాజెక్ట్‌  శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు తాను 4 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి ఈ మోడల్‌ను రూపొందించానని చెప్పారు.  దీన్ని రూపొందించడానికి తనకు  48 గంటలు పట్టిందని మారియప్పన్ చెప్పారు.