మినియేచర్ బుల్లెట్ బైక్ ను చూశారా ?

మినియేచర్ బుల్లెట్ బైక్ ను చూశారా ?

చూడగానే బొమ్మకార్లు, బొమ్మ బండ్ల లాగ అనిపిస్తాయి. కానీ కాదు. చేతితో ముట్టుకొని లేదంటే నడిపి చూస్తే గానీ అవి నిజమైన బండ్లు, కార్లు అనే విషయం తెలియదు. వీటిని తయారుచేసింది  ఒక టీనేజర్. పేరు జి. రోషన్. తమిళనాడులోని ఉదగమండలం అనే ఊళ్లో ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇతనికి వింటేజ్ మోటార్ సైకిళ్లంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఇప్పుడు అతడిని మినియేచర్ బుల్లెట్ బైక్​, రోల్స్​రాయిస్​ కార్లు తయారుచేసేలా చేసింది.  


అది 2015... రోషన్​కి అప్పుడు  పన్నెండేండ్లు. ఒకరోజు వాళ్ల ఊళ్లో ఆటో మొబైల్​ ఎగ్జిబిషన్​లో ఒక వింటేజ్ మోటార్ సైకిల్​ని చూశాడు. వెరైటీ డిజైన్​లో ఉన్న ఆ బండి అతనికి బాగా నచ్చింది. ఒకసారి ఆ బండిని ముట్టుకోవాలి అనుకున్నాడు. కానీ, ఆ బైక్ యజమాని ఎవరినీ ఆ బండిని ముట్టుకోనివ్వట్లేదు. పిల్లల్ని అయితే కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. ఆ రోజు చాలా బాధపడ్డాడు రోషన్. పెద్దయ్యాక సొంతంగా మినియేచర్ బైక్​లు, కార్లు తయారుచేయాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఏడేండ్ల తర్వాత మినియేచ్ బైక్ తయారుచేశాడు రోషన్. విశేషం ఏంటంటే... ఈ బండిని నడపొచ్చు కూడా. ఇప్పుడు అతని దగ్గర15 రకాల మినియేచర్ కార్లు, ట్రక్ వంటివి ఉన్నాయి.

తండ్రి సాయంతో...

రోషన్​కు వింటేజ్ బైక్​ల మీద ఇష్టం పెరగడానికి తండ్రి కేశవన్ కూడా కారణం​. ఆయనకి వింటేజ్ బైక్​లు, కార్లు అంటే పిచ్చి. వీళ్లకు ఒక వర్క్​షాప్​ కూడా ఉంది. దాంతో  మినియేచర్ బైక్​లు, కార్లు తయారీలో కొడుకుకి సాయం చేయాలి అనుకున్నాడు కేశవన్. ముందుగా రోషన్ బైక్, కారు డిజైన్ గీసు కుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి పాత స్కూటర్ల ఇంజన్లు, విడి భాగాల్ని సేకరిస్తారు. వాటిని శుభ్రం చేసి వెల్డింగ్ మెషిన్​, కట్టింగ్ మిషన్ సాయంతో మినియేచర్ మోడల్​కి తగ్గట్టుగా మార్చుకుంటారు. అంతేకాదు వాటికి నిజమైన బండ్లకు ఉండే రంగులే వేస్తారు. 

ఫ్యామిలీ మొత్తానికి...

వీళ్ల కుటుంబంలో అందరికీ వింటేజ్ వస్తువులు అంటే చాలా ఇష్టం. అందుకని ఒకప్పటి నాణేలు, పోస్టల్ స్టాంప్​లు, కెమెరాల్ని భద్రంగా దాచుకుంటారు.1946–1995 కాలం నాటి వింటేజ్ మోటార్​ సైకిళ్లు దాదాపు15 ఉన్నాయి వీళ్ల ఇంట్లో. వాటిలో ఎజ్​డి రోడ్ కింగ్, యమహా ఆర్​డి 350 వింటేజ్​ బైక్​ల మీద తిరగడం అంటే రోషన్​కి మస్త్​ ఇష్టం. అంతేకాదు తాను తయారుచేసిన చిన్న జీపు నడుపుతూ ఊరంతా చక్కర్లు కొడతాడు కూడా. 

సూపర్ బైక్స్ తయారుచేస్తా..

‘‘నా క్రియేటివిటీ నలుగురికీ తెలియాలనే మినియేచర్ బైక్​లు, కార్లు తయారుచేస్తున్నా. బైక్ డిజైన్ గీయడం, విడి భాగాల్ని అమర్చడం, రంగులు వేయడం.. గంటల కొద్దీ మా వర్క్​షాప్​లో గడపడాన్ని ఎంజాయ్ చేస్తాను.  మినియేచర్ బండ్ల తయారీలో ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. పొరపాట్లు చేస్తూనే విడి భాగాలతో బైక్​ ఎలా చేయాలో నేర్చుకున్నా. ఒక మినియేచర్  బండి తయారు చేయడానికి నాలుగు నెలలు పడుతుంది. దివ్యాంగులు ఈజీగా నడపగలిగే సూపర్ బైక్ తయారు చేయాలనేది నా లక్ష్యం. ప్రస్తుతం ఆ బైక్ డిజైన్ మీదే వర్క్ చేస్తున్నా” అంటున్న రోషన్  ఇప్పుడు మెకాట్రోనిక్స్​ ఇంజనీరింగ్​లో డిప్లొమా చేస్తున్నాడు.