లైమ్​స్టోన్​ క్వారీ లీజ్ క్యాన్సిల్​​కు మైనింగ్ శాఖ నిర్ణయం

లైమ్​స్టోన్​ క్వారీ లీజ్ క్యాన్సిల్​​కు మైనింగ్ శాఖ నిర్ణయం
  • మూడున్నర సంవత్సరాలుగా నిలిచిన సిమెంట్​ఉత్పత్తి  
  • దశలవారీగా కార్మికులను తొలగించిన మేనేజ్​మెంట్​ 

మంచిర్యాల, వెలుగు: మూడున్నరేండ్ల కిందట మూతపడ్డ మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులను, ఉద్యోగులను దశలవారీగా తొలగించిన మేనేజ్​మెంట్​ సిమెంట్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ఆ కంపెనీకి చెందిన సుమారు 897 ఎకరాల లైమ్​స్టోన్​ క్వారీ లీజును రద్దు చేయాలని మైనింగ్ డిపార్ట్​మెంట్​ నిర్ణయించింది. దీంతో ఇక ఎంసీసీ కథ కంచికి చేరినట్టేనని స్పష్టమవుతోంది. 

రెండేండ్లు ఆపరేషన్స్​​ లేకుంటే లీజు రద్దు...  

ఎంసీసీ గఢ్​పూర్​లోని సర్వేనంబర్​ 21, తిమ్మాపూర్​లోని సర్వేనంబర్​ 31లో 278.50 హెక్టార్లలో లైమ్​స్టోన్​ మైనింగ్​ క్వారీని లీజుకు తీసుకుంది. ఇందులో 2014 మే నుంచి మైనింగ్​ నిలిచిపోయింది. అలాగే కాసిపేట మండలంలోని కుర్రేగఢ్​ రిజర్వ్​ ఫారెస్ట్​లోని 540, 541, 542, 544 కంపార్ట్​మెంట్లలో 80.44 హెక్టార్లలో మరో లైమ్​స్టోరీ క్వారీ లీజుకు తీసుకుంది. ఇందులోనూ 2019 జూలై నుంచి మైనింగ్​ ఆపరేషన్స్​ పూర్తిగా నిలిచిపోయాయి. ఈ లీజులను 2030 మార్చి వరకు పొడిగింపు కోరుతూ ఎంసీసీ మేనేజ్​మెంట్​ మైనింగ్​ డిపార్ట్​మెంట్​కు గతంలోనే అప్లికేషన్​ పెట్టుకుంది. కానీ... మైనింగ్​ కన్సేషన్​ రూల్స్​ 28(10) ప్రకారం రెండు సంవత్సరాల పాటు మైనింగ్​ ఆపరేషన్స్​ చేపట్టకపోతే లీజు అగ్రిమెంట్​ రద్దవుతుంది. వీటికి సంబంధించి మినరల్​ రెవెన్యూ డ్యూస్​ రూ.45 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లైమ్​స్టోన్​ క్వారీల లీజు రద్దు చేయనున్నట్టు మైనింగ్​ అధికారులు తెలిపారు. ఈ మేరకు క్వారీ సైట్​ను పరిశీలించి మైన్స్​ అండ్​ జియాలజీ డిపార్ట్​మెంట్​ డైరెక్టర్​కు అక్టోబర్​లో రిపోర్టు పంపినట్టు మంచిర్యాల మైనింగ్​ ఏడీ ఆర్​.బాలునాయక్​ చెప్పారు.  

మూడున్నరేండ్లుగా నిలిచిన ఉత్పత్తి...  

మంచిర్యాల సిమెంట్​ కంపెనీ (ఎంసీసీ)లో 2019 జూలైలో సిమెంట్​ ఉత్పత్తిని నిలిపివేశారు. అందులో పనిచేస్తున్న కార్మికులను, ఉద్యోగులను దశలవారీగా తొలగించారు. వారికి రావాల్సిన వేతన బకాయిలు, పీఎఫ్​, ఇతర బెనిఫిట్స్​ కోసం లేబర్​ కమిషనర్​ కోర్టులో పోరాడుతున్నారు. కంపెనీ మూతపడి మూడున్నర సంవత్సరాలు కావస్తుండడంతో ప్లాంట్​లోని మిషనరీలు అన్నీ పాడుబడుతున్నాయి. ఇప్పటికే కొన్నింటిని స్క్రాప్​ చేసి అమ్ముతున్నట్టు సమాచారం. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఎంసీసీ ఇక తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. 1956లో అసోసియేటెడ్​ సిమెంట్​ కంపెనీ (ఏసీసీ)ని ఏర్పాటు చేశారు. 1958లో సిమెంట్​ ఉత్పత్తిని ప్రారంభించారు. రోజుకు వెయ్యి టన్నుల కెపాసిటీతో 2000 సంవత్సరం వరకు నిరంతరాయంగా నడిపించారు. 2006లో కొంతమంది ప్రమోటర్లకు కారుచౌకగా విక్రయించారు. కంపెనీని నడిపించడానికి అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ మూసివేయడంతో దానిపై ఆధారపడ్డ సుమారు వెయ్యి కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయి.  

లైమ్​స్టోన్​ లీజు రద్దుకు ప్రపోజల్స్ 

ఎంసీసీకి సంబంధించిన లైమ్​స్టోన్​ క్వారీల్లో మైనింగ్​ ఆపరేషన్స్​ నిలిచిపోయాయి. రూల్స్​ ప్రకారం రెండు సంవత్సరాలు మైనింగ్​ ఆపరేషన్స్​ చేపట్టకపోతే లీజు రద్దువుతుంది. ఈ మేరకు మైనింగ్​ అండ్ జియాలజీ డైరెక్టర్​కు రిపోర్టు పంపించాం. అక్కడినుంచి ఆర్డర్స్​ వస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. 

- ఆర్.బాలునాయక్​, మైనింగ్​ ఏడీ