జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. శనివారం కలెక్టరేట్ లో కలెక్టర్ బి.సత్యప్రసాద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ఏడాదిన్నర సమయం ఉన్నందున అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
గోదావరి తీరంలో ప్రధాన ఆలయాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, లింక్రోడ్లు, పార్కింగ్, తాగునీరు, స్నాన ఘాట్లు, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళి అర్పించి, జిల్లా ఉత్తమ మహిళా టీచర్లను సన్మానించారు.
