
- కేబినెట్లో వ్యక్తిగత విషయాలపై చర్చ జరగలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో వ్యక్తిగత విషయాలపై ఎలాంటి చర్చ జరగలేదని.. ఈ అంశంపై హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చేసిన ఆరోపణలు నిజమని హరీశ్ భావించినట్లయితే.. ఆయనకు ఇష్టమైన సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయాలన్నారు.
అది పూర్తిగా తప్పు అని చెప్పేందుకు తాను తడిబట్టలతో వస్తానని, అందుకు హరీశ్ సిద్ధమేనా అని అడ్లూరి సవాల్ విసిరారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అని హరీశ్చేసిన తీవ్ర విమర్శలకు.. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ పై హరీశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని, కేబినెట్ లో చర్చకు రాని విషయాలను వచ్చినట్టు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 600 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఉద్యమం పేరుతో విద్యార్థులను, యువకులను రెచ్చగొట్టిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ .. వారి పేరుమీద బీఆర్ఎస్ లో పదవులు పొందారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేయనప్పుడు యువత ఉద్యమిస్తే.. సుమన్ ఎక్కడ దాక్కున్నాడని మంత్రి ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన సుమన్ .. వారి అండతో చేసిన అరాచకాలపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన దౌర్జన్యాల గురించి ఎందుకు మాట్లాడరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు.