కొత్తపల్లి, వెలుగు: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి బధిరుల ఆశ్రమ పాఠశాలలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని, దివ్యాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలోని బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, నిపుణులైన అధ్యాపకులను నియమించి సైన్ లాంగ్వేజ్ ద్వారా తరగతులు బోధిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో 5 శాతం దివ్యాంగులకు కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వచ్చే ఏడాదికల్లా దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్యదృష్టి యూట్యూబ్ చానల్‌ను ఆవిష్కరించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
దివ్యాంగులు అద్భుతాలు సృష్టిస్తారు
దివ్యాంగులను ప్రోత్సహిస్తే అద్భుతాలను సృష్టిస్తారని దివ్యాంగులు, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ అన్నారు. సైన్ లాంగ్వేజ్‌లో జనగణమన పాడిన కరీంనగర్ కలెక్టర్ బృందాన్ని అభినందించారు. స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూపారాణి, అధికారులు, వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
