పద్మారావునగర్, వెలుగు : పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థికి సోషల్ వెల్పేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ ఎస్పీ బాలుర వసతి గృహంలో విద్యార్థి బొల్లె హిమేశ్ చంద్ర 8వ తరగతి చదువుతున్నాడు. గత సెప్టెంబర్ లో వర్షం కురుస్తుండడంతో హాస్టల్ బిల్డింగ్ పై ఆరేసిన బట్టలు తీసుకురావడానికి విద్యార్థి వెళ్లాడు. అదే సమయంలో హాస్టల్‌పై పిడుగు పడడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అక్కడ మెరుగైన వైద్యం లేకపోవడంతో అధికారులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి విద్యార్థిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో అధికారులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. అనంతరం మంత్రి పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున వైద్య ఖర్చులు అందిస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ వెల్ఫేర్డిపార్ట్ మెంట్సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్ బుధవారంవైద్య ఖర్చుల కోసం రూ.18 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. పూర్తిగా కోలుకున్న హిమేశ్చంద్రను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
