ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఎవరున్నా వదలం: భట్టి

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఎవరున్నా వదలం: భట్టి
  • దేశ భద్రతకే ముప్పు తెచ్చారు: భట్టి విక్రమార్క
  • బీఆర్​ఎస్​ నేతలను ఏ ఒక్కరూ క్షమించబోరని హెచ్చరిక
  • చట్ట ప్రకారమే చర్యలు.. వాళ్లలా ప్రొసీజర్​లో జోక్యం చేసుకోం: శ్రీధర్​బాబు
  • ఎన్నికల్లో ప్రజలే బీఆర్​ఎస్ తాట తీస్తారని వార్నింగ్​
  • ఉమ్మడి ఏపీలో కన్నా ఉద్యమకారులను దారుణంగా అణచివేసిన్రు: పొన్నం 
  • ఫోన్లు ట్యాప్​ చేసింది కాక సమర్థించుకుంటున్నారని ఫైర్​

హైదరాబాద్​, వెలుగు:  ఫోన్​ ట్యాపింగ్​తో దుర్మార్గంగా ప్రజల జీవితాల్లోకి గత బీఆర్​ఎస్​ సర్కార్​ చొరబడిందని, ఆ పార్టీ నేతలను ఏ ఒక్కరూ క్షమించరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​ అన్నారు. కేసులో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దేశ భద్రత కోసం తెచ్చిన చట్టాన్ని రాజకీయ అవసరాల కోసం ఫణంగా పెట్టారని, దీంతో దేశ భద్రతకే ప్రమాదాన్ని తీసుకొచ్చారని ఫైర్​ అయ్యారు. శనివారం తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్​ సభ ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సాయంత్రం మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​ పరిశీలించారు. అనంతరం మీడియాతో వాళ్లు మాట్లాడారు. ‘‘ఒకరిద్దరు లంగల ఫోన్లను ట్యాప్​ చేసుండొచ్చు.. నాకైతే ఎర్కలే’’ అంటూ ఇటీవల కేటీఆర్​ చేసిన కామెంట్లను తీవ్రంగా తప్పుబట్టారు.

‘‘రాష్ట్రాన్ని పాలించాలని జనం బాధ్యతలు అప్పగిస్తే.. వాళ్ల ఫోన్లనే ట్యాప్​ చేసుడేంది? ఇంతకంటే ద్రోహం ఏమన్నా ఉన్నదా? భార్యభర్తలు, వ్యాపారస్తులు, జర్నలిస్టులు, అధికారులు, జడ్జీలు ఏ మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి వాళ్ల బెడ్రూమ్‌‌లోకి ఫోన్ ట్యాపింగ్​ రూపంలో దూరారు. ఇన్ని చేసి మాకేం సంబంధం అంటారా?” అని భట్టి విక్రమార్క నిలదీశారు. ‘‘ఫోన్​ ట్యాపింగ్​పై చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి. ఆ ప్రొసీజర్​లో వారిలాగా(గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలాగా) మేము ఇన్వాల్వ్​ కాబోం. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు” అని మంత్రి శ్రీధర్​బాబు హెచ్చరించారు. ఉమ్మడి ఏపీలో కన్నా దారుణంగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రతిపక్షాలు, సొంత పార్టీలోని నేతలను కూడా అణచివేసేందుకు, ఉద్యమాలను తొక్కి పెట్టేందుకు ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. పైగా ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్​ చేస్తే చేసుండొచ్చని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.