సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

రాయికోడ్/మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. బుధేరలోని గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో రూ.6.80 కోట్లతో, లింగంపల్లిలో రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో రూ.11 కోట్లతో నిర్మించనున్న బిల్డింగ్‌‌ల పనులను ఆరా తీశారు. కంకోల్ టోల్‌‌గేట్ సమీపంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రతిపాదించిన హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించారు.

గార్లపల్లి– తక్కలపల్లి మధ్య నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి, సింగూరు బ్యాక్‌‌వాటర్ గ్రామాల అనుసంధాన రహదారులు, ముక్త క్యాసారం-తాటిపల్లి, కోడూరు-సింగీతం డబుల్ రోడ్డు పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సరైన వసతి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. టూరిజం ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. కర్చుల గ్రామంలోని జీపీ ఆఫీస్ వద్దకు వెళ్లగా గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి వెంట  సెట్విన్ చైర్మన్‌‌ గిరిధర్ రెడ్డి, అడిషనల్‌‌ కలెక్టర్ పాండు, ఎస్సీ కార్పొరేష‌‌న్ ఈడీ రామాచారి,  కాంగ్రెస్ పార్టీ మండ‌‌ల అధ్యక్షులు సతీశ్‌‌కుమార్‌‌‌‌, బాలాజీ న‌‌ర్సింలు ఉన్నారు.