విద్య, వైద్యానికి సర్కారు ప్రాధాన్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

విద్య, వైద్యానికి సర్కారు ప్రాధాన్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
  • రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
  • కాంప్రెహెన్సివ్​ మెడికల్ ​క్యాంప్​ప్రారంభం

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్​లో జిల్లా పోలీస్, ఐఎంఏ, ఎన్ఎంజే క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పోలీస్ కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కాంప్రెహెన్సివ్ ​మెడికల్ ​క్యాంప్​ను ఆయన ప్రారంభించారు. 

సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 160 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయని, మరో 80 కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. త్వరలో 80 ట్రామా సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.  సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ ,500 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, అందోల్ లో నర్సింగ్ కాలేజ్, సంగారెడ్డిలో పారామెడికల్ కాలేజ్, క్రిటికల్ కేర్ బ్లాక్, 5 న్యూ పీహెచ్​సీలను ప్రారంభించినట్లు తెలిపారు. 

వట్పల్లిలో సీహెచ్ సీ, తెల్లాపూర్ లో యూపీహెచ్​సీని, పటాన్​చెరు, నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రుల్లో, సీహెచ్ సీ సదాశివపేటలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. హెల్త్ క్యాంపులో  బీపీ చెక్ చేసుకున్నారు. టీజీఐఐసీ చైర్​పర్సన్ నిర్మల జగ్గారెడ్డి,  కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, డాక్టర్ కిరణ్ కుమార్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రాజు గౌడ్, సెక్రెటరీ శ్రీధర్, పోలీస్ అధికారులు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు. 

ప్రతీ వరి గింజను కొంటాం  

జోగిపేట, వెలుగు: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్​ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేట మార్కెట్ యార్డులో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతీ వరి గింజను కొనుగోలు చేస్తామన్నారు.

 దళారులను నమ్మొద్దని సూచించారు. పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్​తోపాటు రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్ పీవో) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అడిషనల్​కలెక్టర్ మాధురి, ఆర్డీవో పాండు, మార్క్​ఫెడ్ డైరెక్టర్ శేరి జగన్ మెహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సురేందర్ గౌడ్ , రమేశ్​గౌడ్ తదితరులున్నారు .