మెడిసిన్స్ కొరత రాకుండా చూసుకోండి : దామోదర రాజనర్సింహ్మా

మెడిసిన్స్ కొరత రాకుండా చూసుకోండి : దామోదర రాజనర్సింహ్మా
  •     హెల్త్ ఆఫీసర్లకు మంత్రి దామోదర ఆదేశం

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వ దవాఖాన్లలో మెడిసిన్స్ కొనుగోలు అంశంపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ్మా సోమవారం ఆరా తీశారు. స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ) ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హాస్పిటళ్లలో అవసరమైన అన్ని రకాల మెడిసిన్స్  అందుబాటులో ఉంచాలని, దేనికీ కొరత రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌‌ పని తీరు, బకాయిలు, పెండింగ్‌‌ పనులు, వాటికి అవసరమయ్యే నిధులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, బడ్జెట్, కొనుగోళ్లపై మంత్రి ఆరా తీశారు.

సుమారు రూ.500 కోట్ల బకాయిలు ఉన్నట్టు అధికారులు మంత్రికి తెలిపారు. మెడికల్ కాలేజీలు, కొత్త బిల్డింగుల నిర్మాణం వంటి అంశాలను మంత్రికి వివరించారు. ఇందులో కొన్ని తమ పరిధిలో, మరికొన్ని ఆర్‌‌‌‌ అండ్ బీ పరిధిలో ఉన్నాయని చెప్పారు. ఈ నిర్మాణాలు అన్ని పూర్తి చేయడానికి భారీ బడ్జెట్ అవసరం అవుతుందని మంత్రికి అధికారులు వివరించారు. మంగళవారం హెల్త్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో మరోసారి మంత్రి రివ్యూ నిర్వహించనున్నారు.